“పాలన వికేంద్రీకరణ జరగాలి. అవినీతి అక్రమాల్లేని పారదర్శక పాలన అందించాలి. ప్రతీ ఒక్కరూ గుండెపై చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోయే రోజు రావాలి. సగటు పౌరుడికి అభద్రత లేని జీవనానికి నాంది పలకాలి. గతంలో.. ఇక ముందు ఇలాంటి పాలన ఎవరూ అందించలేదని వేనోళ్ల కీర్తించాలి. చరిత్రలో మనకంటూ ప్రత్యేక పేజీని రాసుకోవాలి.” సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం సీఎం జగన్ మదిలో గూడుకట్టుకున్న లక్ష్యాలివే. ఆమేరకు ప్రజల్లో కూడా ఇలాంటి ఆశల్ని చిగురింపజేశారు. ప్రస్తుతం అంతా తల్లకిందులైంది. ప్రభుత్వ తీరు దీనికి భిన్నంగా సాగుతోంది. ఎటు పోతుందో తెలీదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాదు. ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. అంచనాలు తారుమారవుతున్నాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. కనుచూపు మేరలో భవిష్యత్ చీకటిమయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోరా !
పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశించారు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని కొన్ని రాష్ట్రాల అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు దఖలు పడిన 29 అంశాలను బదలాయించడం ద్వారా పాలనలో ప్రజల జోక్యం పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఈ స్ఫూర్తిని మరింత సుసంపన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అంతా భావించారు. దీనికి భిన్నంగా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పురుడు పోసుకుంది. స్థానిక సంస్థలకు విధులు, అధికారాల బదలాయింపునకు బదులు ఉత్స విగ్రహాలుగా మార్చేశారు. సచివాలయాలు ప్రజా సమస్యలను అక్కడికక్కడ పరిష్కరించే సాధనాలుగా లేవు. కేవలం పోస్టు మ్యాన్ పనికే పరిమితమయ్యాయి. సుమారు పది శాఖలకు సంబంధించి సిబ్బందిని ఏర్పాటు చేసినా ఏ గ్రామానికి లేదా వార్డుకు సంబంధించి అక్కడకక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. మళ్లీ వీటిని రెవెన్యూ పెత్తనానికి అప్పగించారు. దస్త్రాలన్నీ ఆయా శాఖలకు వెళ్లి రావాలి. మొత్తంగా కొత్త సీసాలో పాత సారా పోసినట్లుంది.

కేవలం నగదు బదిలీతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని నవరత్నాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రజల జీవన స్థితిగతులను లోతుగా అధ్యయనం చేసి ఉంటే ఏ వర్గానికి ఏం చేయాలి.. ఎలాంటి ప్రోత్సాహం అందించాలనే ఓ లక్ష్యం ఏర్పాటునకు దారితీసేది. ప్రజలకు విద్య, వైద్యం భారంగా మారాయని గుర్తించారు. సొంతిల్లు లేక అవస్థలు పడుతున్నట్లు గ్రహించారు. నిరుద్యోగం, ఉపాధి సమస్యను ఆకళింపు చేసుకున్నారు. పరిపాలనలో భాగస్వామ్యం కాలేని అనేక బలహీన వర్గాలను గమనించారు. ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం ఎందుకు కునారిల్లుతుందో స్వయంగా పరిశీలించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాల్సిన ఆవశ్యకతను తెలుసుకున్నారు. కనీసం గుర్తించిన ఈ అంశాలకు సంబంధించి కూడా ఆచరణ సరిగ్గా లేదు.
ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరచడంతోపాటు ప్రజల ఆలోచనా సరళిలో కూడా మార్పులు తీసుకురాగలగాలి. ప్రైవేటుకన్నా ప్రభుత్వమే మిన్ననేట్లు తీసుకున్న చర్యలు ఒక్కటీ లేవు. కీలకమైన వ్యవసాయంలో లొసుగులు కళ్లముందు కనిపిస్తున్నా లోపభూయిష్టమైన కౌల్దారీ చట్టంతో అది మరింత కుదేలవుతోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే పరిశ్రమలు వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికి భిన్నంగా ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇచ్చినా అవి తలకుమించిన భారమవుతాయేగానీ ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కేవలం నగదు బదిలీతోనే ఓ కుటుంబం ఏడాదిపాటు జీవనం సాగించలేదు. ఊతమిచ్చేట్లు ఉండాలేగానీ దాంతోనే అవసరాలు తీరవు. ప్రస్తుతం సర్వరోగాలకూ దాంతోనే నివారణన్నట్లు ప్రభుత్వ పోకడలున్నాయి. చట్టసభల ద్వారా పాలనలో జోక్యం కల్పించాల్సిన అల్పసంఖ్యాక బలహీన వర్గాలు ఇంకా అందనంత దూరానే ఉన్నాయి. పేదలకు సొంతిల్లు ఇవ్వాలనేది ఒక్కటే అడుగులో అడుగేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే దేనికెంత ఖర్చువుతుందనే అంచనాలుంటాయి. ప్రస్తుత సినిమా కష్టాలు చూస్తుంటే అంచనాలు తల్లకిందులైనట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్ ఎటో పోయింది. ఏ పూటకాపూటకు నెట్టుకు రావడం గగనమవుతోంది. ఆర్థిక అత్యవసర స్థితి విధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. లక్ష్యానికి మించి ఆదాయం పెరిగింది. దాంతోపాటు అప్పులూ పెరిగాయి. ఇప్పుడు రుణాలకూ అవకాశం లేని పరిస్థితి ఎందుకొచ్చింది ! ఇంత మంది సలహాదారులు, ఆర్థిక నిపుణులు, తలపండిన ఐఏఎస్లు, పాలనలో అనుభవమున్న ఎందరో బ్యూరోక్రాట్లు ఉండి కూడా ఏం చేస్తున్నారు ! ఈ దుస్థితి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వాధినేత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నారు. దీనికి అంతమెక్కడ అని ఆలోచిస్తున్నారు. భవిష్యత్తేమిటని ఆందోళన చెందుతున్నారు. అర్థమవుతుందా సార్ !