మొబైల్ రింగవుతూనే ఉంది. శిరీష ఫోన్ ఎత్తలేదు. నాన్న ఇప్పటికి మూడు సార్లు కాల్ చేశారు. పొద్దస్తమానం ఏదో ఒకటి చెబుతుంటాడు. అలా ఉండాలి.. ఇలా ఉండాలంటుంటారు. ఆ నస భరించడం కష్టం. బాయ్ ఫ్రెండు నుంచి ఫోన్. “ సాయంత్రం గుడికెళ్దాం. అక్కడ నుంచి రెస్టారెంట్‌కెళ్లి డిన్నర్ చేద్దాం. తర్వాత సెకండ్ షో మూవీ. ఓకేనా !”సరేనని శిరీష సంతోషంతో ఫోన్ కట్ చేసింది. లేచి గబగబా రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకున్నాడు. రాత్రి సెకండ్ షో చూసి రూంకొచ్చింది. బెడ్‌పై వాలిపోయింది అలసటగా. నాన్న దగ్గర నుంచి వాట్సాప్ మెస్సేజ్ వచ్చింది. అబ్బా… అనుకుంటా ఓపెన్ చేసింది.
ఒకటికి మూడు సార్లు కాల్ చేశానమ్మా! ఎక్కడున్నావో.. ఎంత బిజీగా ఉన్నావో. పర్లేదులేమ్మా. నాన్నను కదా ! బిడ్డల పట్ల ఆమాత్రం జాగ్రత్త పడడం సహజం.కొత్త ఉద్యోగం ఎలా ఉంది తల్లీ. రేపు బాబాయ్‌తో పచ్చళ్లు, బియ్యం పంపిస్తానమ్మా. వేళకు వంట చేసుకొని తినడం మరవద్దమ్మా. బయట ఫుడ్ జోలికే వెళ్లొద్దు. ఉదయాన్నే లేవడం నీకు అలవాటేగా. వ్యాయామం చేస్తున్నావా! ఫిట్‌గా ఉంటేనే ఆరోగ్యం.
బిడ్డలకు ఏ కష్టం తెలీకుండా పెంచాలని పెద్దలు చెప్పేది. ఆ మాటను నే పట్టించుకోలేదు. మీ అమ్మ తూచా పాటించింది. ఇన్నాళ్లూ మనకు చెప్పకుండా దాచేసింది. పాతికేళ్ల నుంచి పొగాకు గ్రేడింగ్ కెళ్తోంది. కూలి డబ్బులతోపాటు క్యాన్సర్ తెచ్చుకుంది. ఈ సంగతి తనకు తెలిసినా ఇన్నాళ్లూ దాచింది. అదేమంటే నీ చదువుకు బోలెడు ఖర్చవుతోంది. జబ్బు గురించి తెలిస్తే నువ్వెక్కడ చదువు మానేస్తావోనని చెప్పలేదట. చెన్నైలో చూపించమన్నారు. మొన్నటి భారీ వర్షాలకు నోటిదగ్గర కొచ్చిన పంట నీళ్లపాలైంది. ఓదెలపై నీళ్లింకా పోలేదు. తడిసిన ధాన్యం కొంటారో లేదో. ఓ పక్క అప్పులోళ్లు వెంట పడుతున్నారు. నాతంటాలేవో పడతాలేమ్మా.
నువ్వు వయసొచ్చిన ఆడపిల్లవు. అందరిలా నిన్ను కట్టుబాట్లతో పెంచలేదు. అలాగని నీకిచ్చిన స్వేచ్చను ఏనాడూ నువ్వు దుర్వినియోగం చేయలేదు. ఇప్పుడు నగరంలో ఒంటరిగా ఉంటున్నావు. ఈ వయసులో ఆకర్షణ సహజం. ప్రేమకూ ఆకర్షణకూ తేడా తెలుసుకో. జీవితమంటే ప్రేమొక్కటే కాదు. జీవితంలో అదొక భాగం మాత్రమే. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఖాళీ సమయాల్లో సినిమాలు, షికార్లకు పోవద్దు. పుస్తకాలు చదువుకో. గుళ్లూ గోపురాలకు వెళ్దామని స్నేహితులు పిలుస్తారు. రానని నిర్మొహమాటంగా చెప్పెయ్.
అప్పుడప్పుడూ పేదలు నివసించే మురికివాడలకు వెళ్లు. జీవితమంటే ఏంటో బోధపడుతుంది. నీకొక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. వెళ్లేటప్పుడు అక్కడ ఉండే పిల్లలకు ఏవైనా తినేవి తీసుకెళ్లమ్మా. పేద పిల్లలు కదా. కన్నోళ్లు కడుపునిండా తిండికూడా పెట్టలేరు. ఇంకా ఎప్పుడైనా సమయం దొరికితే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమ్మా. అక్కడ పేద రోగుల ఆక్రోశాలు నీలో మానసిక ధృడత్వాన్ని పెంచుతాయి. వెళ్లేటప్పుడు వాళ్ల కోసం పండ్లు, బ్రెడ్ లాంటివి తీసుకెళ్లమ్మా. ఎందుకు.. ఏమిటి..ఎలా అంటూ ఏదైనా తర్కంగా ఆలోచించు. అప్పుడే వివేచనతో ముందుకు సాగుతావు. ఏదో నా పిచ్చిగానీ ఇవన్నీ నీకు కొత్తగా చెప్పేందేంటీ. చిన్నప్పటినుంచీ ఈ భుజాలపై పెరిగిన దానివి. ఏదో కంటికి దూరంగా ఉన్నావనే ఆందోళన. అంతే. పని వత్తిడిలో రోజూ కాల్ చెయ్యకున్నా పర్లేదు. కనీసం నాల్రోజులకోసారైనా ఈ కన్నోళ్లను పలకరించు తల్లీ. ఉంటానమ్మా. జాగ్రత్త.
శిరీష కన్నీటితో బెడ్ తడిసిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. గుండెల్లో భారం దిగేదాకా రోదిస్తూనే ఉంది. లేచి కళ్లు తుడుచుకొని నాన్నకు కాల్ చేద్దామనుకుంది. ఈ టైమ్‌లో పడుకొని ఉంటారు. ఉదయాన్నే నాన్నకు కాల్ చెయ్యాలి. అమ్మ ఆరోగ్యం కుదుట పడడానికి ఏం చెయ్యాలనేది డైరీలో రాసుకుంది. సిటీకొచ్చి ఆర్నెల్లవుతోంది. తన ప్రవర్తనకు సిగ్గుపడింది. భవిష్య త్తు జీవితాన్ని ఊహించుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకుంది.
(ఓ తండ్రి జ్ఞాపకానికి అక్షర రూపం)