జైభీమ్ మూవీ రియల్ హీరో రిటైర్డ్ జస్టిస్ చంద్రును అమరావతి రాజధానికి మద్దతిస్తున్న వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన కనిపించడం లేదా అని విమర్శలు సంధిస్తున్నారు. లేశమాత్రమైనా వాటి గురించి ప్రస్తావించపోవడాన్ని తప్పుబడుతున్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్రాంత జస్టిస్ చంద్రు విజయవాడలో కేవీపీఎస్ ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఈసందర్భంగా చంద్రు ఏపీ హైకోర్టు తీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీపై పోరాడుతున్నట్లు లేదు. న్యాయస్థానాలపై పోరాడుతున్నట్లుందని విశ్రాంత జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించే న్యాయమూర్తుల్లో ఇద్దరు అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు తీసుకున్నారు. వాళ్లను తప్పించాలని ప్రభుత్వం కోరితే ఉన్నత న్యాయస్థానం పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వమే బిల్లును ఉపసంహరించుకుంది. ఆ జడ్జిలు ఉన్నంత కాలం ఆగి తర్వాత బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఏదైనా సివిల్ కేసులో ప్రభుత్వం కౌంటర్ వేయకుంటే ఫైన్ వేయొచ్చు. దీనికి భిన్నంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సి వస్తుందేమోనంటూ వ్యాఖ్యానించడమేంటని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై న్యాయస్థానంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయాలనుకుంటున్నట్లు చంద్రు వ్యాఖ్యానించారు..
విశ్రాంత జస్టిస్ చంద్రుకు రాష్ట్రంలో మానవ హక్కుల హననం కనిపించలేదా అంటూ రాజధాని మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. కరోనా సమయంలో మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించిన ఓ డాక్టర్ని పిచ్చివాడిగా ముద్ర వేసి చిత్రహింసలకు గురిచేయడం చంద్రుకు కనిపించలేదా అంటూ విమర్శిస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపైనే విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంగతి ఆయనకు తెలీదా అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెట్టి హింసిస్తున్న సంగతి విశ్రాంత జస్టిస్ చంద్రు ఎలా మర్చిపోయారని నెటిజన్లు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చివరకు ప్రభుత్వమే విశ్రాంత జస్టిస్ చంద్రును తీసుకొచ్చి ఇలా హైకోర్టుపై ఆరోపణలు చేయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలపై రిటైర్డ్ జస్టిస్ చంద్రు స్పందిస్తారో లేదో చూడాలి మరి.