అతని పేరు తెలగనేని మాధవరావు. గుంటూరు జిల్లా కారంపూడి పంచాయతీ పరిధిలోని కాష్టాల గడ్డ నివాసి. తనకున్నది రెండెకరాలు. కుటుంబ ఖర్చులు పెరిగి మరికొంత కౌలుకు తీసుకొని వరి, మిర్చి సాగు చేశాడు. తామర పురుగు దెబ్బకు మిర్చి కాపు రాలేదు. వరి వోదెలపైనే తడిసింది. ఈఏడాది పంట సక్రమంగా వస్తే రూ.5 లక్షల అప్పు తీరుతుందని ఆశపడ్డాడు. కాలం అనుకూలించలేదు. అప్పులోళ్లకు ఏం చెప్పాలో తెలియక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు. నిత్యం ఎక్కడో ఒకచోట కౌలు రైతుల బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. రైతు ప్రభుత్వాలని గొప్పులు పోతున్న ప్రభుత్వ పెద్దలకు ఈ మరణ మృదంగం చెవికెక్కడం లేదు.
దేశంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి వేతనం రూ. 20 వేలు ఉందనుకుందాం. అదే కౌలు రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎకరానికి రూ.30 వేలుంటే దేనికి డిమాండ్ ఉంటుంది ! అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరూ ఎగబడరు. అంతా వ్యవసాయం వైపే మొగ్గు చూపుతారు. పంటల సాగుకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రాథామ్యాలే కీలకం. రాష్ట్రంలో మూండింట రెండొంతులు కౌలు సాగే నడుస్తోంది. అలాంటి కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయమెంత ! సంస్థాగత పంట రుణాల్లేవ్. ఇన్పుట్ సబ్సిడీ ఉండదు. రైతు భరోసా లేదు. పంటల నష్ట పరిహారానికీ నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు ఎక్కువ శాతం భూయజమానులు సృష్టించిన బోగస్ కౌలు రైతులకే దక్కాయి. ఇది జగమెరిగిన సత్యం.
రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలు కౌలు సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 80 శాతం కౌలు సాగవుతుంటే మిగతా ప్రాంతాల్లో 70 శాతం పంటలను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు తప్ప బతుకుదెరువు లేదు. గ్రామీణ చేతి వృత్తులు కునారిల్లాయి. వాళ్లకూ ఉపాధి పడిపోవడంతో అనివార్యంగా కౌలు రైతుల అవతారమెత్తుతున్నారు. దీంతో కౌలు ధరలు విపరీతంగా పెరిగాయి.

కౌలు ధర నిర్ణయించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. దీంతో భూ యజమానుల ఇష్టారాజ్యమైంది. పంట సక్రమంగా పండినా మార్కెట్ దోపిడీలో పోను మిగిలితే మరుసటి ఏడాది కౌలు రైతు బతికి బట్టకట్టగలుగుతున్నాడు. లేకుంటే నగరాలు, పట్టణాల్లో వలస కూలీగా మారుతున్నాడు. ఇలా కౌలు సాగుతో దెబ్బతిన్న రాయలసీమ, ప్రకాశం జిల్లా రైతుల కుటుంబాలు బతుకుదెరువు కోసం నగరాలకు వలసబాట పడుతున్నాయి.
ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు ఎకరానికి రూ. లక్ష నష్టపోయారు. అందులో ముందుగా రూ.30 వేలు ముందుగా కౌలు చెల్లించారు. పంట సాగుకు రూ.70 వేలు ఖర్చు పెట్టారు. తామర పురుగు దాడితో పూత మొత్తం రాలిపోతుంది. గుంటూరు జిల్లాలో కాపులేక ఎకరాలకు ఎకరాలే పంటను దున్నేశారు. ప్రకాశం జిల్లాలో సాగు చేసిన 70 వేల ఎకరాల్లో మూడొంతులు కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోకుంటే మిర్చి సాగు చేసిన కౌలు రైతులు కోలుకునే పరిస్థితి లేదు. ఎకరానికి కనీసం రూ.50 వేలు సాయం అందించాలి. ఈ –క్రాప్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం వలంటీర్లతో కౌలు రైతులను గుర్తించాలి. ప్రకాశం జిల్లాలో కౌలు రైతులను ఆదుకోవాలని సీపీఎం నేతలు పూనాటి ఆంజనేయులు, జీవీ కొండారెడ్డి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.