పుష్ప మూవీలోని ఈ లిరిక్స్ ని ఒక ఐటమ్ సాంగ్ కి వాడారు. దీంతో దర్శకుడు సుకుమార్ విమర్శలు ఎదుర్కోవచ్చు. ఆ విషయం పక్కన పెడితే.. విడిగా లిరిక్స్ మాత్రం బావున్నాయి. మహిళలు ధరించే దుస్తుల వల్లే లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ అత్యాచారాలకు స్త్రీలనే బాధ్యుల్ని చేసే దుర్మార్గపు వాదనలు వింటున్నాం. విక్టిం బ్లేమింగ్ నీ, రేప్ కల్చర్ని తప్పు పడుతూ అత్యాచారానికి కారణం రేపిస్ట్ బుద్ధి మాత్రమేనని తేల్చి చెప్పిన మొదటి తెలుగు పాట ఇదేనేమో. పెద్దమనిషిలాగా, స్త్రీల హక్కుల కోసం పోరాడే ఫెమినిస్టుల్లాగా నీతులు చెప్పేవాళ్లను నమ్మొద్దని చెప్పే చివరి చరణం కూడా అద్భుతం.
కోక కోక కోక కడితే,
కొర కొర మంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌను వేస్తే
పట్టి పట్టి చూస్తారు
కోక కాదు గౌనూ కాదు
కట్టులోనా ఏముంది
మీ కళ్లల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
తెల్లతెల్ల గుంటే ఒకడు
తల్లకిందులవుతాడు
నల్లా నల్లా గుంటే ఒకడు
అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు
రంగుతో పనియేముందీ
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి !! ఊ అంటావా మావా!!
ఎత్తు ఎత్తు గుంటె
ఒకడు యెగిరి గంతులేస్తాడు
కురస కురస గుంటె ఒకడు
మురిసి మురిసి పోతాడు
ఎత్తు కాదు కురస కాదు
మీకో సత్తెం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి! !! ఊ అంటావా మావా!!
బొద్దు బొద్దు గుంటె ఒకడు
ముద్దు గున్నావ్ అంటాడు
సన్న సన్నంగుంటే ఒకడు
సరదా పడిపోతుంటాడు
బొద్దు కాదు సన్నం కాదు
వొంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి !! ఊ అంటావా మావా!!
పెద్ద పెద్ద మనిషి లాగ
ఒకడు పోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు
మంచి కాదు సెడ్డా కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాక
అందరి బుద్ధి వంకర బుద్ధే !! ఊ అంటావా మావా !!
– కొండా రాజేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు