రంగస్థలం సినిమా నుంచి
ఎందుకో సుకుమార్ నచ్చుతాడు.
కొత్తదనం కోసం మాత్రమే కాదు,
సత్యాన్ని ఎంతోకొంత తవ్వడం కోసం
అతను ఆరాటపడతాడు కావచ్చు.
పాటల్లోకి, మాటల్లోకి, దృశ్యాల్లోకి
అతను మెల్ల మెల్లగా మట్టి శ్వాసని గుట్టుగా
ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కావచ్చు.
రంగ స్థలం సినిమా సందర్భంలో
టాప్ క్లాస్ సీట్లో పడుకొని సినిమా చూస్తూ
కొన్ని సార్లు ఆగలేక ఆనందంతో
చప్పట్లు కొడుతుంటే..
మా పక్కన ఉన్న టాప్ క్లాస్
కిమ్మనకుండా ఉరిమి చూస్తూ ఉన్నప్పుడు
సుకుమార్ మీద కొంచెం ఇష్టమే కలిగింది.
ఇదిగో.. ఇప్పుడు ఇంకొంచెం ఇష్టం చిగురించింది.
నిజానికి చాన్నాళ్ల క్రితం
పుష్ప పోస్టర్ చూసి నేనో పోస్ట్ రాశాను.
గంధపుచెక్కల స్మగ్లర్ గా ముద్రపడిన
వీరప్పన్ ని చంపి మురుసుకున్న మనం
అసలైన దొంగలను, ఎర్రచందనం మాఫియాను పార్లమెంటుకు పంపుతున్నాం. వాళ్లు చేసే చట్టాల కింద ముక్కుతూ
మూలుగుతూ బతుకు వెళ్ల దీస్తాం.
పొట్ట కూటి కోసం కూలీలుగా వెళ్లిన
వాళ్ళని చంపి శవానికి కూడా కనీసం
అస్తిత్వం ఇవ్వకుండా గర్వపడతాం.
కూలీలను చంపే వ్యవస్థకు
మాఫియాని పెంచే శక్తినిచ్చి
మాట్లాడడానికి ఉచ్చ పోసుకుంటూ
ఊపిరి తీసుకుంటాం.పాటలోకి, మాటల్లోకి
ఒక ప్రాంత యాసని జెండా చేసి
పాన్ ఇండియా ముఖం మీద
రంగులు పూస్తాడు చూడూ..
అందుకు సుకుమార్ నచ్చినట్టు అనిపిస్తాడు.
ఇక అసలు విషయం
ఊ.. అంటావా, ఊఊ అంటావా?
ఆధిపత్య సంస్కృతి మేటలు వేసిన
తెలుగు సినిమా రంగంలో
ఆ ఆధిపత్యానికి లొంగని ఎంతోమంది
యాక్టర్లని, హీరోయిన్లని, డాన్సర్లని
తొక్కిపెట్టి నారా తీసి, బహిష్కరించి, భంగ పరచి,
వేధింపులకు గురిచేసి, పంతంతో పగబట్టి హింసించే
వాతావరణం కొలువైన చోట నటనలో ఒక ప్రతిభావంతురాలుగా నిలదొక్కుకున్న అమ్మాయిగా సమంత ప్రయాణం చుట్టూ అల్లుకున్న సాలెగూడు మనమంతా చూసే ఉంటాం.
నిజానికి ఆ అమ్మాయి
ఇప్పటికీ తెలుగు నేలమీద
ముఖం చూపించడానికి బతికి ఉందంటే
కేవలం ఆమె ఒక్కర్తి ధైర్యమే కారణం కావొచ్చు.
ఆమె మీద గాస్సిప్స్ వెదజల్లి
పొట్ట నింపుకున్న అనేక మీడియా, వెబ్సైట్ కంపెనీలు
ఆమె ధైర్యాన్ని చూసి ఝడుసుకున్నాయి.
ఇప్పుడు ఈ పాటతో సుకుమార్
చంద్రబోస్ ద్వారా ఆమె జీవితానికే కాదు.
సమాజంలో పేరుకుపోయిన మగ అరాసిక్యానికి
ఒక సుతిమెత్తని జవాబు చెప్పాడు.
ఇప్పుడు ఈ పాట మీద ఆంధ్ర ప్రదేశ్ పురుషుల సంఘం కేసు పెట్టి ఈ మగ అరాసిక్యానికి మరికొంత పతాక స్థాయిని తెచ్చిపెట్టింది.
అప్పుడెప్పుడో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
ప్రబంధ కవుల గురించి రాస్తూ
‘ప్రబంధ కవుల దృష్టి
పడకటింటి పెళ్లి కొడుకుల దృష్టి’
అంటూ వివరించిన గతం కొన్నాళ్లపాటు
అర్ధనగ్న దుస్తుల ఎంటర్టైన్మెంట్
పాటగా విస్తరించిన చోట
అదే రాయితో ఇప్పుడు అదే పన్ను
ఊడగొట్టడానికి చంద్రబోస్ ద్వారా సుకుమార్
ఒక ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది.
పోగొట్టుకున్న చోట వెతుక్కోవడం అనేది
ఒక మాట అయితే..
నెట్టేసిన చోట నిలబెట్టాలని చూడడం..
పడగొట్టాలని చూసిన చోట పదునెక్కాలని
చెప్పడం ఉందే అది బాగుంటుంది.
కూలీలను చంపి చట్టసభల్లో కొలువు తీరే
పెద్ద మనుషులే కాదు,
చావడానికి మాత్రమే వీళ్ళు పుట్టలేదు,
అవసరమైతే చంపడానికి కూడా వీళ్లు వెనకాడరు
అంటూ అతను ఒక కొత్త కితాబు ఇవ్వడానికి
సాహసించడం అనేకమందికి నచ్చకపోవచ్చు.
కానీ అండర్కరెంట్గా అతను భాష ,
సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు,
జండర్ సంబంధిత అంశాలమీద
ఒక ప్రత్యామ్నాయం కోరుకుంటున్నట్లుగా
అనిపిస్తూ ఉంటుంది.
ఒక మంచి కవి గా మంచి ఆలోచనలు ఉన్నవాడు
మంచి దర్శకుడిగా కూడా రాణించడంలో
డియర్ సుకుమార్ గా కనిపించడంలో
అతిశయోక్తి ఉండదేమో.
అయితే సినిమా వ్యాపారమే.
ఫక్తు వ్యాపారంగా దిగజార్చిన చోట
మతాల, కులాల గొప్పతనం చాటుకొనే
ఉన్మాదులు ఉన్నచోట
ఇటువంటి వాళ్లు ఒక చిన్న ఊరట అనిపిస్తారు.
– డాక్టర్ నూకతోటి రవికుమార్