ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంటును సిఫారసు చేస్తూ సీఎస్ కమిటీ ప్రభుత్వానికి పంపింది. దీనిపై భిన్నవాదనలు ముందుకొస్తున్నాయి. గత పీఆర్సీ 43శాతం ఇస్తే ఇప్పుడు ఇంత తక్కువ ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యోగుల జీతభత్యాల బడ్డెట్టు దేశంలోకెల్లా ఏపీలోనే ఎక్కువని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు సర్దుకుపోవాలంటోంది. ప్రభుత్వ సొంత రాబడిలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లే 88 శాతం, మొత్తం ప్రభుత్వ వ్యయంలో 36 శాతానికి చేరినట్లు పేర్కొంది. గడచిన రెండున్నరేళ్లలో 3,01,021 మంది ఉద్యోగులకు వేతనాలు పెంచినట్లు తెలిపింది.
ప్రభుత్వం ఏమంటుందంటే.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 ఉంటే, ఏపీలో అది రూ.1,70,215 మాత్రమే ఉంది. 2019 జూలై 1న 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చాం. 2018–19లో జీత భత్యాల వ్యయం రూ.52,513 కోట్లుంటే, 2020–21లో జీతాలు, పెన్షన్ల కింద రూ.67,340 కోట్ల ఖర్చుకు చేరింది.
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతభత్యాల వ్యయం చత్తీస్‌ఘడ్‌లో 32 శాతం, మహారాష్ట్ర 31, పశ్చిమ బెంగాల్ 31, ఒడిశా 29, మధ్య ప్రదేశ్ 28, హర్యానా 23, తెలంగాణ 21 శాతం ఉన్నట్లు వెల్లడించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా రూ.5,380 కోట్లు భారం పడినట్లు తెలిపింది. 1.28 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను తీసుకోవడం వల్ల ఏటా రూ.2,300 కోట్ల భారం పడుతోంది. ఆస్పత్రుల్లో సిబ్బందిని పెంచడం వల్ల రూ.820 కోట్లు, ఆప్కాస్ వల్ల రూ.2,040 కోట్లు అదనంగా ప్రభుత్వం భరిస్తున్నట్లు చెబుతోంది.
ప్రభుత్వ వాదన సరికాదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ నిర్వహణా భారాన్ని మోసేది ప్రభుత్వ ఉద్యోగులే. ఏ పథకమైనా అమలు కావాలన్నా ఉద్యోగులు లేకుండా సాధ్యం కాదు. అలాంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాదిస్తున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలను భారంగా భావించడం ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక ధృక్పథాన్ని వెల్లడిస్తున్నట్లు చెబుతున్నాయి. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు ప్రకటించలేదు. ఇక్కడ నుంచి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కలుపుకొని పోరాడాలని భావిస్తున్నాయి.
అసలు జీతభత్యాల పద్దు అంటే ఏమిటి ! కేవలం ఉద్యోగులు, రిటైర్ అయినవారికి ఇచ్చే పెన్షన్లే కాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల వేతనాలు కూడా ఇందులో ఉంటాయి. వాళ్లకు గన్మెన్లు, ఇతర భత్యాలు కూడా ఈ పద్దులోకే వస్తాయి. ఓ మంత్రి వేతనం రూ.4 లక్షలు. అది 27 మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనానికి సమానం. ఇంకా శాసనసభ, శాసనమండలి నిర్వహణ ఖర్చు కూడా ఈ పద్దులోనే చూపిస్తారు.
ఓ 500 మంది మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నెలకు రూ.50 వేల చొప్పున ఇచ్చేది కూడా ఈ జీతాల పద్దులోనే ఉంటుంది. వాళ్లలో ఒక్కరు కూడా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. పదవిలో ఉన్నప్పుడు నెలకు రూ.2 లక్షల చొప్పున తీసుకొని ఖజానా గుల్ల చేశారు. ఇంకా బోలెడు మంది సలహాదారుల జీత భత్యాలు కూడా ఇందులోనే చూపి ఉద్యోగులకు ప్రభుత్వం ఎంతో చేస్తున్నట్లు మభ్య పెడుతున్నారు. ఉద్యోగ సంఘాల బలహీనతలతో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోంది. దీన్ని ఉద్యోగ సంఘాలు సంఘటిత పోరాటంతో ఎదుర్కోవాలి.
courtesy: దువ్వ శేషబాబ్జి, యూటీఎఫ్ నేత