ఓ గేదెలు మేపుకునే అమ్మాయి కలెక్టరు కావడం చాలా అరుదు. సినిమాల్లోనే చూస్తుంటాం. తమిళనాడుకు చెందిన సీ వనమతి ఐఏఎస్ సాధించారు. ఓ సాదాసీదా కారు డ్రైవరు కూతురు కలెక్టరు అయ్యేదాక ఆ కుటుంబ ఎన్ని కష్టాలు పడిందో.. ఎన్ని కన్నీళ్లను దిగమింగుకుందో. వనమతి 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్‌గా నిలిచారు. ప్రస్తుతం సొంత జిల్లా కలెక్టరుగా చేస్తున్నారు. ఇప్పటికీ మీ హాబీస్ ఏంటని ఎవరన్నా అడిగితే పశువుల్ని మేపడమని అలవోకగా చెప్పేస్తుంటారు. ఎంత ఎదిగినా తాను ఎక్కడ నుంచి వచ్చాననే మూలాలను మరవని ఇటువంటి అధికారులు ఉండడం అద్భుతం.
వనమతి సొంతూరు తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం. ఆమె తండ్రి టీఎన్ చెన్నియప్పన్ ఓ కారు డ్రైవరు. ఆ కుటుంబానికి నాలుగు పశువులే జీవనా ఆధారం. తండ్రి సంపాదన అంతంతమాత్రమే కావడంతో కుటుంబ పోషణ కోసం వనమతి తల్లి పాడిని నమ్ముకుంది. బడికి పోయి వచ్చాక పశువుల ఆలనాపాలనా వనమతి చూసుకుంటూ తల్లికి చేదోడుగా ఉండేది. చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తల్లి కష్టాన్నీ అంతే ఆనందంగా పంచుకుంది. బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచీ కొయ్యకి తగిలించి పశువులను తోలుకొని ఆరు బయట ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ వెళ్లేది.
వనమతి చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలనుకునేది. కాలేజీలో ఉన్నప్పుడు ఓ మహిళా కలెక్టరు వస్తే.. ఆమెను అందరూ ఎంత గౌరవంగా చూసేవారో గమనించింది. అప్పటినుంచి ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంట్లోనూ, అడవిలోనూ ఓ పాఠ్య పుస్తకం ఆమె వెంట ఉండేది. ఎందులోనైనా మంచీ చెడూ రెండూ ఉంటాయి. మంచిని ఎంచుకొని చెడుని వదిలేయాలని వనమతికి ఆమె తల్లి చెబుతుండేది. తను చూసిన టీవీ సీరియల్ ‘గంగా, జమునా, సరస్వతి’ నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి పొందారు. ఇంటర్ తర్వాత చదువెందుకు ? పశువులు కాసుకోడానికి ఈ చదువు చాలదా అంటూ బంధువులు ఎత్తిపొడిచారు. పేద కుటుంబాల్లో ఇంటరు కాగానే ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపాలనేది అప్పటి పద్దతి. వీటన్నింటినీ కాదని వనమతికి కుటుంబం స్వేచ్చనిచ్చింది. చదివించడానికే సిద్దమైంది. చివరికి వనమతి పట్టుదలతో అనుకున్నది సాధించారు.

మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వనమతి తొలుత ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ఆశయాలను సాధించుకునేందుకు డబ్బు అవసరమే తప్ప డబ్బే సర్వస్వం కాదనుకున్నారు. జిల్లా కలెక్టరుగా పదిమందికి సాయపడాలనే లక్ష్యం ఆమెను సివిల్స్ వైపు సాగిపోయేట్లు చేసింది. పెద్దగా చదువుకోని తల్లిదండ్రులు కూతురి చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చుట్టుపక్కల వాళ్ల మాటలకు కన్నీళ్లు దిగమింగుకున్నారు. వనమతి ఇవన్నీ చూస్తూ మరింత ధృడ సంకల్పంతో చదువుపై కేంద్రీకరించారు. తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో అపజయాన్ని చవిచూసినా వెనుకంజ వేయలేదు. రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు. అపజయాన్నుంచే మరింత కసిగా ప్రయత్నించారు. మూడోసారి విజయం తనను వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్‌లో 152 ర్యాంకుతో వనమతి పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.
యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఇక రెండు రోజులే గడువుంది. ఆమె తన తండ్రితో ఐసియూలో ఉంది. తండ్రి వెన్నెముక వ్యాధితో ఐసీయూలో పోరాడుతూనే తన కూతుర్ని చిరునవ్వుతో ఇంటర్వ్యూకి సాగనంపారు. 2015 యూపీఎస్సీలో ర్యాంకు సాధించిన వనమతి లాల్ బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. వనమతి తొలి పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. నందర్బార్ జిల్లా అసిస్టెంటు కలెక్గరుగా బాధ్యతలు చేపట్టారు. పేదరికం ఎదుగుదలకు అడ్డనుకొని కుమిలిపోయేవాళ్లకు వనమతి జీవితం ఓ ఆదర్శం. ఆడపిల్లలకు అంత చదువెందుకనే సగటు పేద కుటుంబాలకు వనమతి జీవితం ఓ స్ఫూర్తిదాయకం.