“కులాల కుమ్ములాటలతో చావలేక బతుకుతున్నాం! ఓ కన్ను ఇటెయ్యవయ్యా స్టాలినూ అంటూ తెలుగు ప్రజల్లో ఆక్రోశం గూడు కట్టుకుంది. నిద్ర లేచింది మొదలు పడుకోబోయేదాకా ఏ పని చేద్దామన్నా కులం ముందుకొస్తోంది. అడుక్కుతినే వాడి దగ్గర నుంచి వ్యాపారుల దాకా.. చిరుద్యోగి నుంచి ఐఏఎస్‌ల దాకా ఎవర్నీ కులం వదలడం లేదు. వీటన్నింటికీ మూలం రాజకీయాల్లోనే ఉంది. మా తెలుగు రాష్ట్రాల్లో దాన్నే ఆయుధంగా చేసుకొని రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. దయచేసి తమరు ఓ చూపు మీ దాయాదులపై వేయాలని కోరుకుంటున్నాం సార్ !” అంటూ ఆంధ్రాకు చెందిన ఓ యువకుడు తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశాడు. తానిలా లేఖ పంపినట్లు ‘తెలుగిల్లు’కు కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు.
సీఎం స్టాలిన్ కుల నిర్మూలన దిశగా అడుగులేసే గ్రామ పంచాయతీలకు పది లక్షల రివార్డు ప్రకటించారు. తత్వ శాస్త్రం ప్రకారం ప్రతీ ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలనేది లక్ష్యంగా పేర్కొన్నారు. అప్పుడే గ్రామాలు ప్రశాంతతకు మారుపేరుగా వర్దిల్లుతాయని స్పష్టం చేశారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమందిని ఆలోచనలో పడేశాయి. తెలుగు సంతతికి చెందిన స్టాలిన్ చెన్నైలో సీఎం అయ్యాక తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ప్రతీ తెలుగోడి గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోతుంది.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ఓ చేపలు అమ్ముకునే మహిళను కండక్టర్ వాసన వస్తుందంటూ బస్సు నుంచి దింపి వేసిన వార్త వైరల్ అయింది. వెంటనే స్పందించిన స్టాలిన్ ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ అడిగారు. బస్సు డ్రైవర్, కండక్టరును సస్పెండ్ చేశారు. శ్రామిక మహిళలను ఇలా కించపరిస్తే సహించేది లేదని చెప్పడం తెలుగు ప్రజల్లో స్టాలిన్ ఓ సూపర్ హీరో అయ్యారు. అసలు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలంటూ సంబరపడ్డారు.
ఈపాటికే ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించడాన్ని తప్పుబట్టారు. తాజాగా ఆలయాల్లో 58 మంది ఎస్సీ,బీసీలను పూజారులుగా నియమిస్తూ డీఎంకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో ఓ మహిళ కూడా ఉండడం విశేషం. పెరియార్ రామస్వామి వేసిన బీజాలు ఇప్పుడు ఆచరణ రూపం దాలుస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుగు ప్రజలను అబ్బుర పరుస్తున్నాయి. కులం గోడలు బద్దలు కొట్టడమే కాదు. సమున్నతమైన రాజకీయ సంస్కృతికి తమిళనాట ముందుడుగు పడడం అభినందనీయం.