రెండు బలమైన సామాజిక వర్గాలతో కూడిన ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నప్పుడు రెండింటితో పోటీపడి బలపడడం కష్టం. ముందుగా బలహీనంగా ఉన్న దాన్ని మరింత బలహీనపర్చడం ద్వారా రెండో వాళ్లతో యద్దం చేయడం తేలిక. సరిగ్గా ఇదే ఎత్తుగడను ఏపీలో బీజేపీ అనుసరించింది. వైసీపీకి అంతర్గతంగా మద్దతు ఇస్తూ వచ్చింది. బలహీనపడిన తెలుగు దేశం పార్టీపై ఆకర్ష్ పథకాన్ని విసరబోతోంది. కులాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట మత ప్రాతిపదికన ప్రజలను కూడేయడం సాధ్యం కాదని బీజేపీ గ్రహించింది. అందుకే ఎత్తుడలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల విజయవాడలో ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం దీనిపైనే లోతుగా చర్చించింది. ఎవరైతే టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలను పార్టీలోకి తీసుకురాగలరో వారికే అధ్యక్ష పదవీ బాధ్యతలు ఇవ్వాలని కేంద్ర పెద్దలు నిర్దేశించారు. అందులో భాగంగానే బీజేపీ చీఫ్ సోము వీర్రాజు 2024 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటిదాకా కాపులు పార్టీకి అండగా ఉన్నట్లు భావించారు. ఇప్పుడు కుల సమీకరణలకు అన్ని పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. కాపులను పవన్ కల్యాణ్ తీసుకొస్తారు. ఇప్పుడు పార్టీ బలం పెరగాలంటే కమ్మ సామాజికవర్గం నుంచి తీసుకోవాలి. అందుకే సీఎం రమేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
జిల్లాల వారీ సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలు ఎవరనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేకించి టీడీపీ మీదనే గురిపెట్టారు. ఆ పార్టీ నుంచి ఎక్కువ మందిని తీసుకునే అవకాశాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకైక అజెండా లోకేష్‌ను సీఎం చేయాలనేది. అందుకనుగుణంగానే ఆయన అడుగులుంటాయి. అందుకే జూనియర్‌ను కూడా పక్కన పెట్టినట్లు ఆరోపణలున్నాయి.
దీన్ని జీర్ణించుకోలేని నాయకులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. అలాంటి నాయకులపై ముందుగా వల విసరాలని భావిస్తున్నారు. ఇటీవల కనుమరుగైన మాజీ మంత్రి నారాయణ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకే ఆయన టీడీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అధికార వైసీపీలో తమ వారసులకు సీట్లు ఖరారు కాని నేతలున్నారు. వాళ్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ పార్లమెంటరీనేత పీవీ మిధున్‌రెడ్డి కేంద్రం వద్ద ఏకరువు పెట్టారు. కేంద్రం ఆదుకోకుంటే అడుగు ముందుకు పడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.
ఈ అవకాశాన్ని కేంద్రంలోని బీజేపీ వదులుకోదు. ఇప్పటికిప్పుడు సహాయ నిరాకరణ ఎత్తుగడను అమలు చేయకున్నా సీఎం జగన్ బలపడేందుకు సహకరించే ఆలోచన మాత్రం చేయదు. రాష్ట్రంలో వేగంగా రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇంతకీ కమలనాధులు ఏ పార్టీకి ఏమేరకు గండి కొడతారో కొద్ది రోజుల్లో తేటతెల్లమవుతుంది.