వైసీపీ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మొన్నామధ్య విద్యా దీవెన నగదు తల్లుల ఖాతాల్లో వేయాలని హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తే చుక్కెదురైంది. గతంలో న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి కళాశాలల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం నిర్దేశించినట్లు గాకుండా ధియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్ల ఇష్టమొచ్చినట్లు ధర నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు సీపీఎస్ అమలు సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చేశారు. అందుకు రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా సరిపోదని వెల్లడించారు. నాడు సీఎం జగన్ సీపీఎస్ రద్దు కు సంబంధించి సాంకేతిక అవగాహన లేనందున హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా దీనిపై నాన్చకుండా తమ వల్ల కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం గొప్ప విషయమే.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో కొట్లాడుతున్నట్లు లేదు. వ్యవస్థలపై పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు న్యాయస్థానాల్లో నిలవని నిర్ణయాలు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులను తృప్తి పరచలేని దైన్యం. ఇంకోవైపు దినదినగండం నూరేళ్ల ఆయుష్షులాగా ఆర్థిక ఇబ్బందులు. వీటన్నింటితో సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదు.
పోలవరం అంచనాలకు పీపీఏ నిత్యం కొర్రీలు వేస్తోంది. కేంద్రం పూటకో మాట మారుస్తోంది. విశాఖ ఉక్కు విక్రయంపై తాము ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఢంకా బజాయిస్తోంది. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తే అదొక ముగిసిపోయిన అధ్యాయంగా చెబుతోంది. విభజన హామీలకు సంబంధించి ఇప్పటివరకు చేసినవి పోను మిగతావి అమలు చేయడానికి ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉన్నట్లు గుర్తు చేస్తోంది.
కనీసం విభజన సమయంలో సూచించిన రెవెన్యూ లోటుకు సంబంధించి రూ.18 వేల కోట్ల గురించి అడిగినా సరైన స్పందన లేదు. కేంద్రం మధ్యవర్తిత్వంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసిన దానికి సుమారు రూ.6 వేల కోట్లకుపైగా బకాయిలు రావాలి. వాటిని ఇప్పించమని అడుగుతుంటే.. మీరు మీరు తేల్చుకోండంటూ జుట్లు ముడేస్తోంది. తెలంగాణ సర్కారేమో ఇంకా విభజనకు సంబంధించి తేలాల్సినవి ఉన్నందున ఆ సొమ్ము ఇప్పుడు ఇవ్వడం కుదరదని మొండికేస్తోంది.
గ్రామపంచాయతీల నిధులు ఈపాటికే కొంత వాడేశారు. మిగతావి కూడా తీసుకుందామంటే కేంద్రం ససేమిరా అంటోంది. పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిపించింది. పోనీ ఏదో ఒకటి చేసి ప్రజల నుంచి రాబడి పెంచుకుందామంటే.. ఎక్కడకక్కడ జనం అడ్డం తిరుగుతున్నారు. జనవరి 1నుంచి వృద్ధాప్య పింఛను భారం మరింత పెరుగుతుంది. నెత్తిమీదకు ఇన్ని కుంపట్లు ఎత్తుకొని సీఎం జగన్ మళ్లీ జనంలోకి రావాలని నిర్ణయించుకున్నారు.
ఈనెల మూడు లేదా నాలుగో వారంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటిదాకా అమలు చేసిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు, నాడు–నేడు, సచివాలయాల ద్వారా పాలనతో ప్రజల్లో ఏమేరకు సంతృప్తి ఉంది.. ఇంకా అసంతృప్తులున్నాయా అనేది తెలుసుకోవడానికే రచ్చబండ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
వచ్చె నెల నుంచి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. ప్రధానంగా 50 యానిట్లలోపు వినియోగించే నిరుపేదల స్లాబును 30 యూనిట్లకు కుదించారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారొచ్చు. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి ప్రజలు ఇప్పటికీ తేరుకోలేదు. సరైన ఉపాధి లేదు. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలకు ఇస్తామన్న నిధులు ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చినవి కూడా వాడేసుకున్నారని సర్పంచులు గుర్రుగా ఉన్నారు. మొత్తంగా సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల స్పందన ఎలా ఉంటుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.