అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని టీడీపీ అనుకూలురు వాదిస్తున్నారు. ఇలా అయితే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తుతాయని వైసీపీ అనునయలు ఘోషిస్తున్నారు. మీ బోడి రాజధాని ఎక్కడుంటే మాకేంటని సామాన్య ప్రజలు తోసిపుచ్చుతున్నారు. మీరెక్కడ పెట్టుకుంటే మాకేంటీ.. మా సొమ్ములు తీసుకెళ్లి మీ ఇష్టమొచ్చిన చోట రాజధానులు నిర్మించుకోవడానికి మేమేం పిచ్చోళ్లమా అని బుర్రకు పని చెబుతున్నారు. ఈ రెండు పార్టీల వాదనలతో జనానికి చిరాకెత్తుతోంది. మీరు రాజులా.. ఇదేమన్నా రాచరికమా ! ఏందిరా మీ గోలంటూ సగటు జనంలో ఆలోచన పురుడు పోసుకుంటోంది.
ఒకప్పుడు రాజులుండేది. రాజులతోపాటు ఆయన పరివారం నివాసం కోసం రాజధాని ఉండేది. రాజుగారి వంది మాగధులు రాజధాని చుట్టూ పోగయ్యేవాళ్లు. అలా అభివృద్ధి చెందిందే హైదరాబాద్. అలాంటి మహానగరాన్ని నిర్మిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో అపోహలు పెంచారు. రాష్ట్ర విభజన చేసుకోమని లేఖ ఇచ్చిన ఈ మహానుభావుడే ప్రజల్లో హీరో అయ్యారు.
2014 నుంచి ఐదేళ్లు మహా నగర నిర్మాణం కోసం ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించారు. ప్రజలకు అర్థమైంది. లాగి పెట్టి కొడితే అధికారాన్ని కోల్పోయి విపక్ష నేతగా మిగిలారు. రాజులు పోయారు. రాచరికాలు పోయాయి. ఆ భావజాలం మాత్రం సజీవంగా ప్రజల మూలిగలు పీలుస్తోంది.
అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు ఇదే రాజధాని చుట్టూ రాజకీయం మొదలెట్టింది. విపక్ష టీడీపీ ఆర్థిక మూలాలను పెకలించాలనుకుంది. రాజధాని చుట్టూ ఆ పార్టీ అల్లిన మాయాజాలాన్ని తుత్తునియలు చేయాలనుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. టెక్కాలజీ పెరిగింది.
ఓ ఉద్యోగి ఇంటి దగ్గర నుంచే పనిచేసే సౌలభ్యం ఏర్పడింది. సీఎం ఇంట్లో కూర్చొని మంత్రులు, ప్రజలతో మాట్లాడే వెసులుబాటు వచ్చింది. అందుకే రెండున్నరేళ్ల నుంచి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక రాజధానితో పనేముంది !
అయినా రాజధాని చుట్టూ అభివృద్ధి జరిగితే లాభ నష్టాలున్నాయి. ఈపాటికే చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి రాజధానిగా ప్రకటించిన టీడీపీకి లబ్ది చేకూరుతుంది. దాన్ని రాజకీయంగా భూ స్థాపితం చేయడానికి మూడు రాజధానులన్నారు. ఆ నిర్ణయం న్యాయస్థానాల్లో వీగిపోతుందని వెనక్కి తగ్గారు.
రాష్ట్ర సర్కారుకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న కేంద్ర పెద్దలు రాజకీయ క్రీడను ప్రారంభించారు. అందులో భాగంగా అమరావతే రాజధాని అన్నారు. దీంతో మరోసారి మూడు రాజధానుల గురించి ఆలోచిస్తామని సీఎం జగన్ మడమ తిప్పారు. కేంద్ర పెద్దల దాగుడు మూతలాటలను గుర్తించారు. అయినా మారు మాట్లాడలేని దుస్థితిలో పడిపోయారు.
మూడు పంటలు పండే సారవంతమైన నల్లరేగడిలో నిర్మాణాలు సాధ్యం కాదని శ్రీ కృష్ణ కమిషన్ చెప్పింది. అయినా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని అమరావతిలో నెలకొల్పేందుకు సిద్దమయ్యారు. నాడు రాజకీయంగా నష్టమని భావించి ప్రతిపక్షంలో ఉన్న జగన్ వ్యతిరేకించలేదు.
అప్పుడు అనుకూలమని చెప్పి ఇప్పుడు కాదంటే 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల సంగతేంటీ.. ఈపాటికే ఖర్చు పెట్టిన ప్రజాధనం రూ.10 వేల కోట్లు వృథాయేనా ! మీ రాజకీయ క్రీనీడలకు ప్రజల సొమ్ము నేలపాలు కావాల్సిందేనా ! ఇంకా జనాన్ని ఎన్నాళ్లు మభ్య పెడతారు ? సీఎం ఎక్కడుంటే అదే రాజధాని. దాని చుట్టూనే ప్రజల సొమ్ము తగలేసి అభివృద్ధి చేస్తామంటే జనం పిచ్చోళ్లు కాదు.
మాయ కథలు అల్లుతూ అవే వార్తలుగా మలిచి ప్రజలను నమ్మించే రోజులు పోయాయి. మీ బోడి మీడియాలను జనం విశ్వసించే స్థితిలో లేరు. మీకూ మీకూ రాజకీయ కక్షలుంటే చెరో కర్ర తీసుకొని తలపడండి. ఎవరు విజేతలో తేల్చుకోండి. మీ వ్యక్తి గత కక్షలు, కార్పణ్యాలను రాష్ట్ర ప్రజలపై రుద్దుతామంటే ఎవరూ అంగీకరించరు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే సహించరు.
ఈ రెండు రాజకీయ పార్టీలను ప్రజలు చీదరించుకుంటున్నారు. ఈ గ్యాప్‌ను పూరించే వాళ్లు కనిపించడం లేదు. పవన్ గానీ, బీజేపీ గానీ ఈ రెండింటికీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు అర్థమైంది. సగటు ప్రజలకు దూరమైన ఈ రెండు పార్టీల సందులో దూరేవాళ్లు కనిపించడం లేదు. అందుకోసం ప్రజలు కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు.