సినిమా వాళ్ల సెంటుమెంటు అంతాఇంతా కాదు. ఏదైనా ఓ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యిందంటే చాలు. ఇక అదే ఫార్ములాను పట్టుకొని ఊపేస్తుంటారు. ఇటీవల జైభీమ్ చిత్రంలో ప్రతీ పాత్ర గ్లామరస్ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్లాయి. నేడు ఆస్కార్‌కు ఎంపికైన ఈ చిత్రం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. సినిమా అంటేనే ఊహాలోకంలో విహరింపజేసేదనే నానుడిని జైభీమ్ తుత్తినియలు చేసింది. అది సాధించిన విజయంతో టాలీవుడ్ కూడా డీగ్లామరస్ పాత్రలతో చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతోంది.
ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలో కథా నాయకుడు అల్లు అర్జున్ను కొంత డీగ్లామరస్‌గా చూపించారు. ఓ ఎర్రచందనం స్మగ్లర్ ఎలా ఉంటాడో అతికినట్లు పాత్రను మలిచారు. దర్శకుడు సుకుమార్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరూ నేచురల్‌గా ఉంటుంది. చిత్రంలో హీరోయిన్ రష్మిక పాత్రను పూర్తి డీగ్లామరస్‌గా తీర్చిదిద్దారు. ఇటు మాస్, అటు క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేట్లు చిత్రాన్ని నడిపించడంలో దర్శకుడు సుకుమార్ ప్రత్యేకత కనిపిస్తోంది. దీన్నిబట్టి ఇకనుంచి టాలీవుడ్లో డీగ్లామరస్ పాత్రలున్న చిత్రాలకు డిమాండ్ పెరగొచ్చు.
మొన్నామధ్య వచ్చిన కొండపొలం సినిమాలో కథానాయకుడు, నాయిక పాత్రలు కూడా డీగ్లామరస్‌గా ఉన్నాయి. ఇందులో నటించిన మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమాను సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. సినీ ఇండస్ట్రీలో ఏదైనా ఓ మార్పు సంచలనం సృష్టించిందంటే దాన్ని ఫాలో అవడం సహజం.
డీగ్లామరస్ పాత్రలు సగటు ప్రజలకు దగ్గరగా ఉంటాయి. జనం తమ మధ్యలోనే ఉన్నట్లు ఫీలవుతారు. అందువల్లే అంత క్రేజ్ వస్తోంది. గతం మాదిరిగా ప్రేక్షకుల్ని ఊహల్లో విహరింపజేసే పాత్రలు కనుమరుగు కానున్నాయి. కేవలం కథాంశబలం, డీగ్లామర్ పాత్రలున్న చిత్రాలు ప్రజల మదిని దోచుకోనున్నాయి. అటువైపుగా ముందు మెగా ఫ్యామిలీ నుంచి పయనం మొదలైంది. కొద్దిరోజుల్లో చిత్రసీమను శాసిస్తోన్న సినీ హీరోలంతా ఇదే బాట పట్టక తప్పదు మరి. అప్పుడు కథలకు డిమాండ్ పెరుగుతుంది. కొత్త రచయితలకూ అవకాశాలు మెరుగయ్యే అవకాశముంది.