మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే మందుబాబులు ఆనందం పట్టలేక గంతులేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఏకంగా మద్యం దుకాణానికి పూజలు చేశారు. క్వార్టర్ బాటిల్‌కు రూ.30 నుంచి 90 తగ్గించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల నాటికి ఇంకా ధరలు తగ్గే అవకాశముందని అక్కడకు చేరిన వాళ్లు చెప్పడంతో సంతోషంతో కేరింతలు కొట్టారు. గుంటూరు నగరంలో అక్కడక్కడా మధ్యాహ్నం దాకా దుకాణాలు తెరుచుకోలేదు. ఆదేశాలు అందుకున్నాకనే దుకాణాలు తెరుస్తామని చెప్పడంతో దుకాణాల దగ్గర పెద్ద ఎత్తున క్యూ కట్టారు. బయట బెల్టు షాపుల్లో యథేచ్చగా పాత ధరలతో మద్యం విక్రయాలు కొనసాగాయి.
ప్రభుత్వం మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధత ఉండేట్లు ధరలు తగ్గించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) రకం మద్యంపై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం ధరలు తగ్గాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం రూ.150 ఉన్న క్వార్టర్ ధర రూ.120కి తగ్గింది. 180 ఉన్న బాటిల్ రూ.130, రూ. 190 ఉన్న మద్యం రూ.140, రూ.200 ధర ఉన్నది రూ.150, రూ.250,260 రేటున్న క్వార్టర్ రూ.200, రూ.360 ధర కలిగిన మద్యం రూ.270, రూ.410 ధర ఉన్నది రూ.370, రూ.660 రేటున్న మద్యం ధర రూ.590కు తగ్గింది. మొత్తంగా వివిధ కేటగిరీలకు చెందిన మద్యంపై రూ.30 నుంచి రూ. 90 వరకూ ధరలు తగ్గాయి.