వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుడు సుభానీతో మరికొందరు కలిసి దాడి చేశారు. ఓ లాడ్జిలో తలదాచుకున్న గుప్తాను పట్టుకొని కొట్టారు. మోకాళ్లపై కూర్చొని బాలినేనికి క్షమాపణలు చెప్పేదాకా వదల్లేదు. ఈ ఘటనను వీడియో రికార్డు చేస్తూ మంత్రి బాలినేనికి చూపారు. గుప్తాను కొట్టొద్దని, వదిలేయాలని చెప్పినట్లు తర్వాత మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సుబ్బారావు గుప్తా ఈనెల 12న బాలినేని పుట్టిన రోజు సందర్భంగా చీరలు పంచుతూ మంత్రి బాలినేనికి, సీఎం జగన్కు పలు సూచనలు చేశారు. పార్టీకి నష్టం కలుగజేసే పనులను అడ్డుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో హల్చల్ చేసింది. శనివారం రాత్రి గుప్తా ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. అతని బైక్ను ధ్వంసం చేశారు. గుప్తా తండ్రి వెంకటరత్నం, భార్య నాగమణి, పిల్లలను భయోత్సాతానికి గురి చేశారు. ఈ ఘటన అనంతరం సుబ్బారావు గుప్తా భయంతో అదృశ్యమయ్యాడు. సోమవారం ఉదయం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ కూడా పార్టీ పట్ల తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించాడు.
మరోవైపు గుప్తా కుటుంబ సభ్యులు తమకు ప్రాణ భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి బాలినేని గుప్తా తండ్రి, భార్యకు కాల్ చేసి మాట్లాడారు. ఇకపై ఎలాంటి గొడవలు జరగవని భరోసానిచ్చారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే గుప్తాను ఓ లాడ్జి గదిలో సుబానీ, తదితరులు పట్టుకొని కొడుతున్న వీడియో బయటకొచ్చింది. వీడియో చూసిన మంత్రి బాలినేని గుప్తాను కొట్టొద్దని అనుచరులను వారించినట్లు మీడియాకు వెల్లడించారు. గుప్తా కొద్దిరోజుల నుంచి మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నట్లు అతని భార్య చెప్పిందని బాలినేని వెల్లడించారు.

గుప్తా అన్ని పార్టీల జెండాలు తయారు చేసి విక్రయిస్తుంటాడు. గుప్తా పార్టీపై చేసిన వ్యాఖ్యల వెనుక టీడీపీ హస్తం ఉండొచ్చని మంత్రి బాలినేని అనుమానం వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో పార్టీల పరంగా ఘర్షణ పడే వాతావరణాన్ని తానెప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. తన హయాంలో అలాంటి పరిస్థితులు ఎన్నడూ తలెత్తలేదని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని బాలినేని వ్యాఖ్యానించారు.
ఇంకోవైపు ఒంగోలు నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అటు ఆర్యవైశ్యులు, ఇటు ముస్లిమ్స్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంతకముందెన్నడూ వైసీపీలో ఇలా జరగలేదు. గుప్తాపై దాడిని పలువురు ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఆర్యవైశ్య సంఘాల నేతలు స్పందించారు. గుప్తాపై దాడిని నిరసించారు. దీనిపై ఆందోళన చేస్తామని ప్రకటించారు. కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
గుప్తాపై దాడిని నిరసిస్తూ పర్చూరులో ఆర్యవైశ్యులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ ఘటనపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను ఒంగోలులో అమలు చేస్తున్నట్లు టీడీపీ నేత రాజ్ విమల్ విమర్శించారు. ఓ వ్యక్తిని కొడుతుంటే మంత్రి లైవ్లో చూడడమేంటని నిలదీశారు. పోలీసులు నిద్ర పోతున్నారా అంటూ రాజ్ విమల్ ప్రశ్నించారు. ప్రజల వాక్స్వాతంత్య్రాన్ని కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.