అధికార వైసీపీలోని కార్యకర్త నుంచి పైస్థాయి నేతల వరకూ బీపీ విపరీతంగా పెరుగుతోంది. కంటికి కనపడిన వాళ్లందర్నీ చితక్కొడుతున్నారు. తప్పును ఎత్తి చూపినా సహించడం లేదు. కనీసం చిన్న విమర్శ చేసినా తట్టుకోలేకపోతున్నారు. అసలు అదీ ఇదీ అన్లేదు. అదేదో సినిమాలో గిచ్చితే గిచ్చిచ్చుకోవాలి. కొడితే కొట్టిచ్చుకోవాలన్నట్లుంది. ఈ అరాచకంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎవరినీ అదుపుచేయలేని దుస్థితి నెలకొంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
రెండు రోజుల క్రితం ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను కొట్టారు. కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వీడాలని, పార్టీ నేతల పోకడలను విమర్శించినందుకు చితక్కొట్టారు. మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పేదాకా వదల్లేదు. ఈ ఘటన మంత్రి బాలినేని స్పందిస్తూ తన అనుచరుడు సుభానీ ఆవేశానికి లోనై కొట్టినట్టు చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్యులు భగ్గుమన్నారు. ఎక్కడకక్కడ నిరసనలు మిన్నంటాయి. అంతకముందు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే.. సీఎం జగన్ను విమర్శించినందుకు కార్యకర్తలకు బీపీ పెరిగి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సీఎం అనునయించారు.
నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా బోయపాలెంలో వెంకట నారాయణ అనే వ్యక్తి తల పగలగొట్టారు. ప్రజల వ్యతిరేకతను తగ్గించుకోవడానికే ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు చెప్పడమే అతను చేసిన తప్పు. నరసరావుపేటలో రోడ్డు మీద నడచిపోతున్న వాళ్లను వైసీపీ కార్యకర్తలు పూటుగా మద్యం తాగి చితక బాదారు.
ఇటీవల విశాఖలో ఓ వ్యాపారి వైసీపీ నేత నుంచి తనకు ప్రాణ భయం ఉందని, కాపాడమంటూ సీఎం జగన్ను వేడుకున్నాడు. కడప జిల్లా రాజంపేటలో ఓ కుమ్మరి కులానికి చెందిన వ్యక్తికి సంబంధించిన ఆస్తిని బలవంతంగా స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించి లాగేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే ఒకటా రెండా.. అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అకృత్యాలకు అంతేలేకుండా పోతోంది.
వరుస ఘటనలు ప్రజల ముందు అధికార పార్టీ దోషిగా నిలవాల్సి వస్తోంది. పార్టీ యంత్రాంగం ఇంతగా బరితెగించడానికి అసలు కారణం అధినేత నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది. అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో పార్టీ కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాల్లేవు. తొమ్మిదేళ్లపాటు పార్టీ జెండా మోసిన వాళ్లకు ప్రభుత్వ పాలనలో ఎక్కడా జోక్యం లేదు. ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు వేయించిన కార్యకర్తలు ఎలా ఉన్నారని పరామర్శించిన నాయకుల్లేరు.
ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా కనీసం పార్టీ క్యాడర్ ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు. దీంతో తమ అభిమాన నేతల దృష్టిలో పడేందుకు వాళ్లు చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. అనుచరులు, కార్యకర్తలను అదుపు చేయలేని దుస్థితిలో నేతలు ఉండడం దారుణం. ఇప్పటికైనా సీఎం జగన్ పార్టీ యంత్రాంగాన్ని గాడిలో పెట్టకుంటే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.