కేరళకు చెందిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తేనెతుట్టెను కదిలించారు. జడ్జిలను జడ్జీలే నియమించే విధానం మనదేశంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిల పెన్షన్ బిల్లుకు సంబంధించి రాజ్యసభలో మూడు రోజుల క్రితం జరిగిన చర్చలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగాన్ని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మెచ్చుకున్నారు. ఈ అంశం ప్రధాన మీడియా స్రవంతిలో రాకపోవడం దురదృష్టకరమన్నారు. జాన్ బ్రిట్టాస్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
జడ్జీల నియామకం తీరుపై జాన్ బ్రిట్టాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ ప్రసంగంలోని పాయింట్లను మినిట్స్ నుంచి తొలగిస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు. ఇంతకీ జాన్ ఏం మాట్లాడారంటే.. న్యాయమూర్తుల నియామకం అనువంశికంగా మారిందన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఓ జడ్జికి సంబంధించిన కుటుంబీకులు పలువురు ఇంతకముందు న్యాయమూర్తులుగా కొనసాగిన నేపథ్యం ఉందన్నారు. ఆ జడ్జి తల్లి వైపు నుంచి, తండ్రి వైపు నుంచి పలువురు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన జడ్జి అయ్యారు. ఇది జడ్జి పదవి వారసత్వంగా మారినట్లు కాదా అని నిలదీశారు.
కాంగ్రెస్ విషయంలో వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ విమర్శలు సంధిస్తోంది. మరి జడ్జీల నియామకంలో ఇదంతా ఏంటని ప్రశ్నించారు. అసలు జడ్జిల నియామకంలో డైవర్శిటీ కూడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా కొనసాగిన వారిలో బ్రాహ్మణులే ఎక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు. దీనికి సంబంధించి లెక్కలతో సహా వెల్లడించారు. ఒక కులాన్ని తాను వ్యతిరేకించడం లేదని చెప్పారు. ఒకే కులానికి చెందిన వాళ్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా కొనేసాగడంలో ఉన్న లోగుట్టు ఏంటని నిలదీశారు. ఎంపీ జాన్ బ్రిట్టాస్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీలు తప్పుబట్టారు.
సుప్రీం కోర్టు సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక న్యాయ వ్యవస్థలో ఆసక్తికరమైన చర్చలు ముందుకొచ్చాయి. ఎన్వీ రమణ జ్యూడిషియరీలో రావాల్సిన మార్పులు, సంస్కరణల గురించి అనేక సందర్భాల్లో పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేయాలనుకునే సీజేఐ రమణ ఎంపీ జాన్ బ్రిట్టాస్ లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందిస్తారు ! న్యాయమూర్తుల నియామకంలో కులజాడ్యానికి చెక్ పెట్టడానికి ఏం చేస్తారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.