వాళ్లు కాకుంటే వీళ్లు. వీళ్లు కాకుంటే వాళ్లనే పద్ధతికి ఏనాడో కాలం చెల్లింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో రాజకీయ పార్టీల తీరిదే. ఇక నుంచి ఆ పప్పులుడకవ్. తమ విధానాలేంటనేది స్పష్టతనివ్వకుంటే శాశ్వతంగా కనుమరుగవడమే. సగటు ప్రజలపై ఇష్టారీతిన భారాలు మోపుతూ ఎవరి ప్రయోజనాల కోసం పార్టీలు పనిచేస్తున్నాయనేది ఆలోచించే తర్కం జనంలో వచ్చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఆ దిశగా తమ విధి విధానాలను సమీక్షించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారనేది అహం వీడి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అందుకు సిద్ధంగా ఉన్నారా.. ఉంటే ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.
ఇప్పటిదాకా సగటు పౌరుడి ఆదాయంలో మూడింట రెండొంతులు కేవలం విద్య, వైద్యానికి వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజలు వివిధ రకాలుగా పన్నులు చెల్లించేది దేనికి ! ఎవరికి వాళ్లే పిల్లలకు చదువు చెప్పించుకో స్కూళ్లు పెట్టుకోలేరు. ఎవరి మానాన వాళ్లు వైద్యం చేసుకోలేరు. కావాల్సిన ప్రాజెక్టులు కట్టుకోలేరు. రోడ్లు వేసుకోలేరు. పరిశ్రమలు పెట్టి ఉద్యోగిత కల్పించలేరు. అందుకే ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తారనేది స్పష్టం.
మరి వసూలైన పన్నులతో ప్రజలకు ఇలాంటి సర్వీసు ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకు ! ఈ తర్కం ప్రజల్లో వచ్చింది. అందుకే ప్రజలు టీడీపీ విధానాలను గుండుగుత్తగా వ్యతిరేకించారు. ఈ వాస్తవాన్ని ఆ పార్టీ గుర్తించిందా ! తమ విధానాలు తప్పని ప్రజల ముందు భేషరతుగా అంగీకరించే ధైర్యం ఉందా !
ప్రస్తుత వైసీపీ సర్కారు కూడా కళ్లు తెరవాలి. సంక్షేమ పథకాలనేవి ఎవరికి అమలు చేస్తున్నారు. ప్రజలు చెల్లించిన పన్నులు, తెస్తున్న అప్పులు మొత్తం తిరిగి అవే జనానికి దామాషా పద్దతిలో ఇస్తున్నారా ! ఎవరు ఎంత చెల్లిస్తున్నారు.. ఎవరికి పంచుతున్నారనే ఆలోచన మొదలైంది. సగటు పౌరుడు తాము వివిధ పన్నుల రూపంలో చెల్లిస్తుందెంత ! తమకు ప్రభుత్వం నుంచి వస్తున్నదెంతనేది బేరీజు వేసుకుంటున్నారు.
కోటానుకోట్లు వెచ్చించి ప్రసార సాధనాల్లో ఇస్తున్న ప్రకటనలతో ప్రజల్లో ఇటువంటి ఆలోచన రేకెత్తిస్తోంది. ఎక్కడా బ్యాలెన్స్ లేదని భావిస్తున్నారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తాము చెల్లిస్తున్న పన్నులతో సమానంగా తాము సేవలను పొందలేకపోతున్నామనే భావన నెలకొంది. ప్రభుత్వం, వైసీపీ దృష్టిలో కులాలవారీ ప్రాధాన్యం పెరిగింది. ఇది అనివార్యంగా సామాజిక అశాంతికి దారితీస్తుంది.
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కార్యక్రమాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీ కులాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలంటే కాపు, ఒంటరి కులాలు నాయకత్వం వహించాలని చెప్పారు. ఈ మాటల వెనుక మర్మాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వైసీపీ రెడ్ల పార్టీ. టీడీపీ కమ్మ పార్టీ. కాబట్టి కాపు కులాలన్నీ ఐక్యంగా మిగతా నిమ్న సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఈ భావన నిజంగా ప్రజల్లో వస్తే రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలను మినహాయిస్తే 60 శాతానికి పైగా వివిధ సామాజిక వర్గాల ప్రజలున్నారు. మాపై మీ పెత్తనమేంటని నిలదీసే పరిస్థితులను సృష్టిస్తున్నారు. అధికార ప్రతిపక్షాలు తమ విధి విధానాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని గుర్తిస్తాయా !