కడప జిల్లా పులివెందుల వాసులకు చేపలు, రొయ్యల దుకాణాలు అందుబాటులోకి తెస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. సీఎం ప్రకటనతో విపక్షాలు కాసేపు ఛలోక్తులు విసిరాయి. ఇదే సందర్భంగా ఇండస్ట్రియల్ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ యూనిట్ నెలకొల్పేందుకు భూమి పూజ చేశారు. ఇదేమీ చిన్నాచితకా కంపెనీ కాదు. ప్రపంచంలోనే ఫార్చూన్ 500 కంపెనీల్లో ఇదొకటి. దేశ వ్యాప్తంగా 3031 మల్టీ బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయి. 25వేల మంది దాకా ఉద్యోగులున్నారు. అలాంటి కంపెనీ గార్మెంట్స్ తయారీ కోసం ఇక్కడ యూనిట్ నెలకొల్పుతోంది.
ఇక్కడ రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా యూనిట్‌ను ప్రారంభించనుంది. అందులో రెండువేలకు పైగా కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అందులోనూ 80 శాతం మహిళలే ఉంటారు. ఇదొక మంచి పరిణామం. ప్రభుత్వం ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఓ స్కిల్ డెవలప్మెంటు సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా పులివెందులలో కూడా ప్రారంభిస్తోంది. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు ఆదిత్య బిర్లా సంస్థ ఉద్యోగాలిస్తుంది. కరవు సీమలో ప్రధానంగా మహిళలకు ఉపాధి లభించడం అత్యంత ఆవశ్యం. ఇలాంటివి మరికొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఆదిత్య బిర్లా వ్యాపారం బావుంటే యూనిట్ ను విస్తరించి పదివేల మంది దాకా ఉపాధి కల్పించే అవకాశాలున్నాయి.
సహజంగా ఏ కంపెనీ అయినా మొదట కార్మికులుగా తీసుకునేది మహిళలనే. వాళ్లయితే సహనంతో పనిచేస్తారనేది ఓ కారణమైతే.. పురుషుల కన్నా తక్కువ వేతనానికి నియమించుకోవచ్చని కంపెనీలు భావిస్తుంటాయి. ఎటొచ్చీ ప్రభుత్వమే వాళ్లకు తగిన శిక్షణ ఇచ్చి స్కిల్డ్ వర్కర్‌గా కంపెనీకి అందిస్తుంది. అందువల్ల కనీస వేతనం నెలకు రూ.24 వేలకు తగ్గకుండా ఇప్పించాలి. ఇక్కడే ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలి. కరవు ప్రాంతం కదా తేలిగ్గా ప్రజల మూలిగలు పీల్చేయొచ్చనే ఆలోచన ప్రతీ పెట్టుబడిదారుడుకి ఉంటుంది. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి అక్కడ నియమించే కార్మికులకు కేంద్రం సూచించిన కనీస వేతన చట్టాన్ని అమలు చేయించాలి.
కార్మిక చట్టాల ప్రకారం ప్రసూతి సెలవులు, డ్యూటీ మధ్యలో విరామ సమయం, తక్కువ ధరకు క్యాంటీన్లో ఆహారం అందుబాటులోకి తేవడం, రిక్రియేషన్, సరైన రక్షణ పరికరాలు అందించేట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఫలానా ఆదిత్య బిర్లా కంపెనీలో పనిచేస్తున్నామని మహిళలు గొప్పగా చెప్పుకునే రీతిలో ఉండాలి. కంపెనీ కార్పొరేట్ రెస్సాన్సిబిలిటీ కింద కార్మికుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేసేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆదిత్య బిర్లా కంపెనీ వల్ల పులివెందుల పరిసరాల మహిళలకు ప్రయోజనం. ఇప్పుడు తొలి అడుగు పడింది. ఇలాంటి మరికొన్ని యూనిట్లు ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నెలకొల్పేట్లు ప్రభుత్వం ప్రోత్సహిస్తే చాలు. వాళ్లు ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించరు. ఆ దిశగా సీఎం జగన్ ముందుకు సాగాలి.
One of the good thing in this govt