శతమానం భవతి సినిమా చూస్తాం. ఉమ్మడి కుటుంబాల అనుబంధాలను ఆస్వాదిస్తాం. కుటుంబ సభ్యుల వెడబాటుకు మనసు కష్టపెట్టుకుంటాం. మనకు తెలీకుండానే కన్నీళ్లు చిప్పిల్లుతాయి. బాబాయ్, మావయ్య, పిన్ని, అత్తా, తాతయ్య, నాయనమ్మ అంటూ పిల్లల కేరింతలు. మరదళ్ల ఛలోక్తులు. ఇలాంటి పిలుపులు మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. సినిమా అయిపోయినా ఇంకా లేదా అనిపిస్తుంటుంది. అంత మంచి ఉమ్మడి కుటుంబాలు ఎలా అంతరించిపోయాయో తెలుసా ! అలనాటి అనుబంధాలకు, ఆప్యాయతలకు దూరమై జీవచ్ఛవాల్లా యాంత్రిక బతుకులీడుస్తున్నాం. ఈ దుస్థికి కారణమేంటో తెలుసా ! అయితే ఓ లుక్కేయండి !
1970వ దశకం నాటికి దేశంలో ఉమ్మడి కుటుంబాలు పరిఢవిల్లుతున్నాయి. పరిమితమైన జీవనానికి, సంతోషాలకు కొదవలేదు. అనేక ఆంక్షలు, ఆచారాలు దునుమాడుతున్నా మనసులు తేటతెల్లంగా ఉండేవి. కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆపదైనా అంతా విలవిల్లాడేది. అసలు ఆ ఆనందాలే వేరు. అలాంటి ఉమ్మడి కుటుంబాలు నాశనమవడానికి హరిత విప్లవం మొదటి కారణమైంది. భూసంబంధాలు మరింత మంటను రాజేశాయి. హరిత విప్లవంతో వ్యవసాయంలో వచ్చిన మిగులుతో పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
పారిశ్రామిక వేత్తల లాబీయింగ్‌తో భారీ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యాయి. వినిమయ సరకులు తయారు చేసే పరిశ్రమలు ప్రైవేటు రంగంలో వేళ్లూనుకున్నాయి. ఆయా పరిశ్రమలకు కావాల్సిన భూమి, విద్యుత్, ఉక్కు, ఇతర ముడి సరకులు మొత్తం ప్రభుత్వాధీనంలోని పరిశ్రమలు అందించేవి. సబ్బులు, కాస్మొటిక్స్, ప్లాస్టిక్, చెప్పులు ఇతర గృహోపకరరణాలను దేశీయ పారిశ్రామిక వర్గం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసింది. ఇవి కొనే వినియోగదారులు పెరగడం లేదు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు వంట గదికే పరిమితమయ్యారు.
ఓ కుటుంబం మొత్తం సంపాదన తిండికే సరిపోయేది. కుటుంబాలను విడగొట్టాలి. చిన్న చిన్న కుటుంబాలు రావాలి. మహిళలు సౌందర్య సాధనాలకు వినియోగదారులు కావాలనే ఆలోచన వచ్చిందే తడవుగా ఉమ్మడి కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. మన సాంస్కృతిక రంగంపై దాడికి శ్రీకారం చుట్టారు. జానపదులు, నాటకాల స్థానంలో సినిమాను ప్రమోట్ చేశారు. సౌందర్య సాధనాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఉమ్మడి కుటుంబాల్లో సుఖ సంతోషాలకు కరువనే స్థాయికి తీసుకెళ్లారు. చిన్న కుటుంబాలే చీకూచింత లేనివని ఊదరగొట్టారు. జనాభా నియంత్రణ కార్యక్రమం ఇందుకు మరింత దోహదపడింది.
చిన్నచిన్న సంతోషాల కోసం ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. పరిమిత కుటుంబాలు వచ్చేశాయి. రకరకాల కాస్మొటిక్స్, దుస్తులను డంప్ చేశారు. మార్కెట్లో డంప్ అయిన సరకుల అమ్మకాలు జోరందుకున్నాయి. నెమ్మదిగా ఆడవాళ్లు వంటగది వదిలి బయటకు వచ్చారు. కంపెనీలు తయారు చేసే సౌందర్య సాధనాలకు కొనుగోలు దారులుగా మారారు. ఇందుకోసం కంపెనీలు మహిళల హక్కుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అలాంటి సినిమాలు తీసే వాళ్లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇప్పించాయి. గ్రామీణ ఉమ్మడి కుటుంబాలను ఛిద్రం చేసి పట్టణాల్లో పరిమిత కుటుంబాల ఏర్పాటునకు రెండు దశాబ్దాలపాటు పారిశ్రామిక వర్గం చాలా తిప్పలు పడింది.
అప్పుడే గ్రామీణ చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. వ్యవసాయంలో పరస్పర సహకారానికి బదులు కూలీలు ఏర్పడ్డారు. పంటల సాగులో యాంత్రీకరణ దెబ్బకు కూలీలు కాస్తా పట్టణాల్లోని కర్మాగారాల్లో వెట్టి కార్మికులుగా మారారు. ఈ పరిణామాలన్నీ 1991 వరకూ నిరాటంకంగా కొనసాగాయి. 1992 నుంచి నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. మార్కెట్ ఆధారిత వ్యవస్థ వేళ్లూనుకుంది.
ప్రపంచబ్యాంకు నిధులు, వాళ్ల నిబంధనలు, ప్రపంచ వాణిజ్య సంస్థ.. దానికి నాయకత్వం వహించే అమెరికా ఒత్తిడులకు భారత పాలకవర్గం తలొంచింది. ఆయా దేశాల వత్తిడితో మనకు అవసరమైన రంగంలో కాకుండా సమాచార సాంకేతిక రంగాన్ని భుజానికెత్తుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రపంచమంతా కుగ్రామం అయింది.
ప్రపంచ దేశాల మధ్య దూరం తగ్గింది. మనిషికీ మనిషి మధ్య అగాధం పెరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యంత్రంలా మార్చేసింది. ఇప్పుడు మనకు మనుషులతో సంబంధం కన్నా మొబైల్, నెట్, బైక్, కారుతోనే బంధం బలపడింది. వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. కేవలం మార్కెట్లో సరకులకు వినియోగదారులుగా మాత్రమే మిగిలిపోయాం. అనుబంధాలకు, అప్యాయతలకు దూరమై ఆక్రోశిస్తున్నాం. మనిషికి రోబోలకు తేడా లేకుండా పోతోంది. ఏవి తల్లీ నాటి ఉమ్మడి కుటుంబాలంటూ వాపోతున్నాం. ఈ పరిణామాలు ఇంకెక్కడకు దారితీస్తాయో మరి !