” సార్ ! పొద్దుట్నించి పనే లేదు ! ఓ వంద రూపాయలు ఇస్తారా ! పాపని ఊరికి పంపాల సార్ !” దీనంగా అడిగాడు. చెప్పులు కుడుతున్న దావీదు పక్కనే ఓ పాప బ్యాగుతో కూర్చొని ఉంది. నవీన్ ఎప్పుడూ అక్కడే షూ పాలిష్ చేయిస్తుంటాడు. తెలిసిన వ్యక్తి కదా అని అడిగినట్లుంది. వంద ఇచ్చాడు. ఆసక్తి కొద్దీ పిల్లలెంతమంది.. ఏం చేస్తున్నారని నవీన్ అడిగాడు. ఇద్దరు అమ్మాయిలు..ఓ అబ్బాయి అనిచెప్పాడు. ఆడపిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. పాత చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏళ్లు గడచిపోయాయి.
ఓ రోజు రోడ్డు పక్కన దావీదు కనిపించలేదు. చుట్టు పక్కల వాళ్లను నవీన్ వాకబు చేశాడు. ఆరోగ్యం బాగలేక ఇంటిదగ్గరే ఉంటున్నట్టు చెప్పారు. నాకెందుకులే అని నవీన్ తోసేసుకొని పోలేకపోయాడు. ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్లాడు. చిన్న రేకుల ఇల్లు. బయట ఎవరూ కనిపించలేదు. ఇంట్లో అలికిడి కూడా లేదు. పిలిచినా ఎవరూ పలకలేదు.
నెమ్మదిగా తలుపు నెట్టి లోపలకు చూశాడు నవీన్. నవారు మంచంపై పడుకున్న దావీదు కనిపించాడు. తలుపు శబ్దానికి కళ్లు తెరిచాడు. ” ఎలా ఉన్నావ్ దావీదు ! సెంటర్లో కనిపించకపోయే సరికి ఏమైందో తెలుసుకుందామని వచ్చా!” అంటూ దావీదు చెయ్యి పట్టుకున్నాడు. అంతే బావురుమంటూ వెక్కిళ్లు పెట్టాడు.
” పోయిన క్రిస్మస్ నుంచి వంట్లో బావుంటల్లేదు సార్ ! వయసైపోయింది. ఆరోగ్యం సహకరించటల్లేదు ! మంచానికే పరిమితమయ్యా !” అని చెప్పాడు. మరి పిల్లలు, భార్య ఎక్కడని అడిగాడు నవీన్. ” ఇద్దరు ఆడపిల్లలతోపాటు కొడుకు పెళ్లి చేశా. రెక్కలొచ్చిన పక్షులు గూట్లో ఉండవు కదా సార్!” అని దావీదు నిట్టూర్చాడు.
మరి నీ సంగతేమిటని నవీన్ అడుగుడుండగానే దావీదు కన్నీటి పర్యంతమయ్యాడు. ” మొన్నటిదాకా మా ఆడదే అన్నీ చూసుకునేది. నెలనెలా కొద్దో గొప్పో కొడుకు సర్దే వాడు. ఈ మధ్య ఇవ్వడం మానేశాడు. పూట గడవడం కష్టంగా ఉంది ! ఆడ పిల్లల దగ్గరకు పోయొస్తానని మా ఆడది ఎల్లింది !” అంటూ దావీదు కన్నీళ్లు తుడుచుకున్నాడు.
నవీన్ అక్కడ నుంచే స్నేహితుడికి కాల్ చేసి భోజనం తెప్పించాడు. మళ్లీ వస్తానని చెప్పి నవీన్ దావీదు కొడుకు అడ్రస్ తీసుకొని బయల్దేరాడు. ” ఈ వయసులో కన్నవాళ్లను వదిలేస్తే ఎలా బతకాలి ! వాళ్లు జీవితమంతా మీ కోసం ధారపోశారు. నువ్వసలు మనిషివేనా! ” అంటూ నవీన్ దావీదు కొడుకుని నిలదీశాడు. ఆ కుర్రాడు ఏం మాట్లాడలేదు. చంటి పిల్లను ఎత్తుకొని నవీన్‌ను ఇంట్లోకి తీసుకెళ్లాడు.
మంచంపై అతని భార్య పడుకొని ఉంది. ఆమెను చూపిస్తూ.. ” నాకు నెలకు పది వేలు వస్తాయి సార్! అందులో నాన్నకు కొంచెం పంపేవాడ్ని. ఈ మధ్యనే మా ఆవిడ మంచం పట్టింది. డాక్టర్లు గుండె జబ్బని చెప్పారు. మందులకే నెలకు రెండు వేలు అవుతున్నాయి. పసిపిల్లకూ వంట్లో బావుండట్లేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచట్లేదు సార్!” అంటూ ఉబికొస్తున్న కన్నీళ్లు కనిపించకుండా తల పక్కకు తిప్పుకున్నాడు. నవీన్ నిశ్చేస్టుడయ్యాడు. నోటమాట రాలేదు. జాగ్రత్తంటూ అతని భుజాన్ని తట్టి అక్కడ నుంచి మౌనంగా కదిలాడు. దావీదును ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో.
– క్రిస్మస్ శుభాకాంక్షలతో ప్రత్యేక కథ