” ఇంత ఖర్చు పెట్టి పుట్టిన రోజు పండగ చేసుకోవాలా ! ” కల్యాణి ఉవ్వెత్తున లేచింది. ” పోన్లేద్దూ ! ఏడాదికోసారే కదా ! చిన్నచిన్న సరదాలను కాదంటే పిల్లలు బాధపడతారు”అంటూ భర్త నరేష్ ఓదార్పు మాటలు కల్యాణికి రుచించలేదు. ”ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి !ఏదైనా మన స్థాయికి తగ్గట్టుండాలి. లేకుంటే జీవితాలు సర్వనాశనమవుతాయి” అని హెచ్చరించింది.
వాళ్లకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి సాయి పదో తరగతి. కౌముది ఎనిమిది చదువుతోంది. సాయి పుట్టిన రోజు పండక్కి హోటల్ నుంచి వంటకాలు తెప్పించారు. ధూంధాం చేశారు. యాభై వేలు ఖర్చయింది. కల్యాణికి ఇది నచ్చలేదు. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులే. డబ్బుకు కొదవలేదు. కానీ పిల్లలకు కష్టం తెలీకుండా పెంచడం కల్యాణికి ఇష్టం లేదు. పిల్లలకు ఏ కష్టం తెలీకుండా పెంచాలని నరేష్ అంటాడు.
ఓ రోజు స్కూలు ప్రిన్సిపాల్ నుంచి కాల్ వచ్చింది. ఏమైందోనని కల్యాణి ఆఫీస్లో పని వదిలేసి హడావుడిగా వెళ్లింది. ప్రిన్సిపాల్ గదిలో సాయితోపాటు మరో విద్యార్థి కనిపించాడు. ” ఈ అబ్బాయి పేరు రవీంద్ర. వాళ్లమ్మానాన్న కూలికెళ్తుంటారు. వాళ్లకు చేదోడుగా రవీంద్ర స్కూలు వదలగానే టీకొట్టులో పనిచేస్తాడు. ఈ పిల్లాడ్ని సాయి రోజూ ఏడిపిస్తున్నాడు. కూటికిలేని వెధవంటూ నానా దుర్భాలాడుతున్నాడట. గతంలో ఓసారి మందలించాం. అయినా పద్ధతి మార్చుకోలేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాల్సివచ్చింది” అంటూ ప్రిన్సిపాల్ వివరించారు.
కల్యాణికి ఎక్కడలేని కోపమొచ్చింది. లేచి చెంప ఛెళ్లుమనిపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామని చెప్పి సాయిని తీసుకెళ్లింది. ఇంటికెళ్లి సుధీర్ఘంగా ఆలోచించింది. తన ఆలోచన భర్త ముందుంచింది. ఆయన ససేమిరా అన్నారు. అయినా కల్యాణి పట్టుపట్టి ఒప్పించింది. రవీంద్ర పనిచేసే హోటల్లోనే సాయిని పనికి కుదిర్చింది.
అప్పటి నుంచి మరో రకమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. బంధువుల నుంచి స్నేహితులు..ఇరుగుపొరుగంతా కల్యాణిని ఆడిపోసుకోవడం ఎక్కువైంది. పిసినారి అన్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి పిల్లాడ్ని హింసిస్తుందంటూ.. ఎన్నో ఈటెల్లాంటి మాటలు కల్యాణి గుండెను గాయపరిచాయి. కన్నీళ్లను దిగమింగింది. ఆఫీసులో సూటిపోటిమాటలకు విలవిల్లాడేది. అయినా గుండెను దిటవు చేసుకుంది. నరేష్ పరిస్థితి మరీ దారుణం. కల్యాణితో సరిగ్గా మాట్లాడడమే మానేశాడు. ముభావంగా ఉంటున్నాడు.
సాయి తొలుత కొన్నాళ్లు మరాం చేసినా అలవాటు పడ్డాడు. ఒక్కో రోజు వాడు నిద్రలో కలవరిస్తుంటే.. తన్నుకొచ్చే కన్నీళ్లను ఆపలేక రోదించేది. పరీక్షలు అయిపోయాయి. ఓ రోజు సాయి రవీంద్రతో కలిసి ఇంటికొచ్చాడు. ” అమ్మా ! రవీంద్ర వాళ్లమ్మకు వంట్లో బాలేదు ! వెళ్లి చూసొచ్చాను. పాపం పనికెళ్తేనే గడిచేది వాళ్లకి. మనింట్లో చాలా సరుకులున్నాయి. అందులో కొన్నిస్తే.. వాళ్ల ఆకలి తీరుతుంది కదా.. అని..” సాయి చెబుతుండగానే దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దాడింది. కన్నీళ్లు తుడుచుకుంటూ కదిలింది విజయదరహాసంతో..