నిన్నటి రోజున ఒకే వేదికపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం వైఎస్ జగన్ను చూసిన ప్రజల్లో అనేక ఆకాంక్షలను రేపింది. వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం ఓ మంచి పరిణామంగా అభివర్ణిస్తున్నారు. వ్యవస్థల మధ్య మరింత సమన్వయం సాధించాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత సుసంపన్నం చేయాలని భావిస్తున్నారు. ఇది మంచి సుపరిపాలనకు నాంది పలకాలని ఆశిస్తున్నారు.
ఇప్పటిదాకా 151 సీట్లు సాధించి రాష్ట్ర చరిత్రను తిరగ రాసిన వైసీపీ సర్కారు చేసే నిర్ణయాలు, జీవోలన్నీ ఎక్కువ శాతం న్యాయ సమీక్షకు నిలవకుండా పోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందని సీఎం జగన్ పునరాలోచించుకోవాలి. ప్రజలకు ఏదైనా మంచి జరగాలని ఆశించడంలో తప్పు లేదు. అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి ఉండాలి. వ్యవస్థల పరిధిని దాట కూడదు. అప్పుడే అది ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. రాజకీయాలు ఎన్నయినా ఉండొచ్చు. రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్నప్పుడు వాటికి అతీతంగా ఆలోచించాలి.
ఈ వేదికపై ఇదే విషయాన్ని ఉటంకిస్తూ జస్టిస్ ఎన్వీ రమణ చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం కల్పించుకుంటుందన్నారు. మానవ హక్కులను కాపాడేందుకు ఏ స్థాయిలోనైనా న్యాయ వ్యవస్థ నికరంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు శాసన, కార్య నిర్వాహక వ్యవస్థ బాధ్యతను మరింత పెంచుతున్నాయి.
వ్యవస్థల మధ్య సమన్వయం సాధించడానికి ఇలాంటి కలయికలు మరిన్ని కావాలి. ఏదైనా చర్చించుకోవడం ద్వారా లోపాలను అధిగమించవచ్చనేది ఎవరూ కాదనలేని విషయం. ఇక్కడ నుంచి అలాంటి సహృద్భావ వాతావరణంలో ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి అన్ని వ్యవస్థలూ వాటి పరిధి లోపల మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని ఆశిద్దాం.