ఇప్పటిదాకా ఒకటో తేదీ వస్తుందంటే సగటు వేతన జీవుల్లో నాలుగు రోజుల ముందే ఆందోళన మొదలయ్యేది. నేడు రాష్ట్ర సర్కారుకూ ఒకటో తేదీ గుబులు మొదలైంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే గుండె మీద చెయ్యేసుకొని నింపాదిగా ఉండేది. ఇప్పుడు వాళ్లకూ ఒకటో తేదీన జీతాలు పడతాయో లేదోనన్న బెంగ ప్రారంభమైంది. ఇంటి అద్దెలు, కిరాణా కొట్లో బాకీలు, ఈఎంఐలు ఎలా చెల్లించాలన్న బాధ ఎక్కువైంది. ఇక చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న వారి బాధలు వర్ణనాతీతం.
ప్రతినెలా ప్రభుత్వానికి ఉద్యోగుల జీత భత్యాల కింద రూ.3,500 కావాలి. సామాజిక పింఛన్లు ఇచేందుకు రూ.1500 కోట్లు అవసరం. పాత అప్పుల కింద కట్టాల్సిన కిస్తీలు మరో రూ.3,500 కోట్లు ఉంటుంది. ఇవిగాక ఆర్బీఐ దగ్గర వాడుకున్న ఓడీలకు చెల్లించాల్సింది, ఇతర ఖర్చులతో కలుపుకుంటే రూ.11 వేల కోట్లు అవసరం. సగటున ప్రభుత్వానికి ప్రతినెలా సొంత ఆదాయం రూ.6 వేల కోట్లకు మించి లేదు. మరో ఐదువేల కోట్ల లోటు కనిపిస్తోంది. దీన్ని ఎలా అధిగమించాలో అర్థంగాక ఆర్థిక శాఖ తల పట్టుకుంటోంది.
ప్రస్తుతం అప్పులు సుమారు రూ.7 లక్షల కోట్లకు చేరాయి. ఇక్కడ నుంచి బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. బడ్జెట్ కు మించి 180 శాతానికిపైగా అప్పులు పేరుకుపోయాయి. ఇక ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడమో, తనఖా పెట్టడమో తప్ప నెల గడవని దుస్థితిలోకి ప్రభుత్వం జారిపోయింది. నేటిదాకా సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇలాంటి దుస్థితి దాపురించిందని కొందరి వాదన. గత ప్రభుత్వాలు సంక్షేమానికి ఇచ్చిన దానికన్నా అదనంగా ఇచ్చిందేమీ లేదని విపక్షాలు ఘోషిస్తున్నాయి.
మరి ఈ దుస్థికి కారణమేంటో ప్రభుత్వం వెల్లడించాలి. సంక్షేమ పథకాల అమలులో కూడా హేతుబద్దత ఉండాలి. అన్ని వర్గాలకూ ఏదో ఒక పథకం కింద లబ్ది చేకూరుస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమవుతుంది. ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగారిన వర్గాలకు చేయూతనివ్వడం కోసం పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆయా పథకాల మంజూరులో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నా నికరంగా కొన్ని కుటుంబాలైనా దారిద్ర్యరేఖను దాటి పైకి వచ్చేది.
ఇప్పుడా పరిస్థితి లేదు. ఆ పూట గడవడానికి సరిపోయేట్లు మాత్రమే నగదు బదిలీ పథకాలున్నాయి. దీంతో దిగువ మధ్యతరగతిని సైతం పేదరికంలోకి నెట్టేట్లుంది. ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. భేషజాలకు పోకుండా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచడం పారదర్శక ప్రభుత్వ లక్షణం.