ఇటీవల కాంగ్రెస్ పార్టీ 2023 ప్రత్యేక మేనిఫెస్టో అంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఆ మేనిఫెస్టోను పరిశీలిస్తే.. పాత చింతకాయ పచ్చడి హామీలనే తలపిస్తోంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గుడిసెకు వెదురు బొంగులు, బర్రె, గొర్రెలిచ్చిన సామెతగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతికి బట్టకట్టాలంటే వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలకన్నా ఎక్కువగా ఉండాలి. లేదా మరేదైనా కొత్తగా ఆలోచించాలి. ఇవేమీ లేకుండా ఇలాంటి మేనిఫెస్టోతో ఎన్నికలకు పోతే మళ్లీ గుండు సున్నానే మిగులుతుంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందంటే.. ఆధార్‌కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేదాంట్లో రూ. పది వేలు దాటితే నెల రోజుల్లోపు ప్రభుత్వం చెల్లిస్తుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి రూ. 5 లక్షలను మూడు విడతలుగా ఇస్తుంది. కనీస వేతనం రూ.30 వేలు ఇచ్చే విధంగా అధికారం చేపట్టిన నెల రోజుల్లో చట్టం చేస్తుంది. 18 నుంచి 60 ఏళ్లలోపు కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. రైతులకు రెండు లక్షల్లోపు రుణ మాఫీ, ఆకస్మిక మరణానికి రూ.8 లక్షల పరిహారం ఇస్తామని పేర్కొంది. కల్యాణ లక్ష్మి పథకం కింద యువతుల వివాహానికి రూ.2.16 లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో ఉంది. భూమి కేంద్రీకృతమవుతోంది. పంటలు పండించే వాళ్ల దగ్గర భూమి లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి నెలకొంది. విత్తనం దగ్గర నుంచి పంట మార్కెటింగ్ దాకా దళారులదే పెత్తనమైంది. రైతులకు సంస్థాగత రుణాలు లభించడం లేదు. దీన్నుంచి రైతులను కాపాడాలి, వ్యవసాయం మనుగడ సాధించాలంటే దేశ వ్యాప్తంగా సాగు భూమిపై వ్యక్తిగత హక్కులను రద్దు చేయాలి.
పంటలు సాగు చేసుకునే వారికి మాత్రమే ప్రభుత్వం భూ వసతి కల్పించాలి. విత్తనం నుంచి పంట పండేదాకా అయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చాలి. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరించి మార్కెటింగ్ చేయాలి. పంటల సాగుకు అయ్యే వ్యయానికి అదనంగా 50శాతం కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయం మెజారిటీ ప్రజలకు ఆదరువుగా నిలుస్తుంది.
ఇప్పటిదాకా కనీస వేతన చట్టాలు చేయడమే తప్ప అమలు గురించి పట్టించుకున్న యంత్రాంగం లేదు. న్యాయ స్థానాల తీర్పులను సైతం పెడచెవిన పెడుతున్నారు. చట్టం అమలు చేయకుంటే తీవ్ర శిక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇలా చేయగలిగే దమ్ముందా ! కనీస వేతన చట్టం సక్రమంగా అమలైతే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ పారిశ్రామిక రంగానికి ఊతమవుతుంది. అందువల్ల 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఉపాధి లేదా ఉద్యోగం కల్పిస్తామనే హామీ కీలకం.
ఇది సుసాధ్యమైతే ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రోత్సాహకాలు, రైతుల ఆత్మహత్యలకు పరిహారాలు అనే ఊసే ఉండదు. విద్య, వైద్యం అనేవి ప్రైవేటు రంగంలో రద్దు చేయాలి. కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. పేదల నుంచి సంపన్నుల దాకా ఒకే స్కూల్లో చదువుకోవాలి. ఒకే ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే అసమానతలు తొలగి దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఒక్కసారి తమరి మేనిఫెస్టోపై పునరాలోచన చేయండి రాహుల్ జీ !