ఎవరి నోట విన్నా ఇదే. ఫేస్బుక్ తెరిస్తే వీర్రాజు పోస్టులే. మరింకే సామాజిక మాధ్యమాల్లోకి తొంగి చూసినా అవే ట్రోల్స్. రాజుగారు ఒక్కరే కాదులెండి. అందరిదీ అదే బడి. ఎవరికి వారు తగ్గేదేల్యా అన్నట్టున్నారు. ప్రజాగ్రహ సభలో రెచ్చిపోయారు. ఊగిపోయారు. ఎంతంటే.. ఏం మాట్లాడుతున్నారో కూడా సోయలేనంతగా. అంతా కలిసి కాషాయ జెండాను ఇక లేవకుండా పాతాళానికి తొక్కేస్తున్నట్లు గ్రహించలేక పోవడం.. అదో విలాపం.
నిన్నటి ప్రజాగ్రహ సభ కమలనాధులకు రివర్స్ కొట్టినట్టుంది. నెటిజనం నోట్లో ఇప్పటికీ నానుతూనే ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ జవదేకర్ నుంచి సుజనా చౌదరి దాకా.. సీఎం రమేష్ నుంచి సోము వీర్రాజుతో సహా అందర్నీ నెట్టింట్లో ఉతికి ఆరేస్తున్నారు. అదేదో ఎన్టీఆర్ సాంగ్ మాదిరిగా ఆరేసుకోబోయి పారేసుకున్న సామెతయింది. పాపం.. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలో లేక వీళ్లే కేంద్ర పెద్దలను తప్పుదోవ పట్టించారో తెలీదు. ప్రభుత్వంపై అసంతృప్తులను సొమ్ము చేసుకోవడానికి ప్రజాగ్రహ సభ పెట్టమని చెప్పిందెవరోగానీ.. బీజేపీని కోలుకోకుండా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తులున్న మాట వాస్తవం. వాటిని ఎక్కడ ఎలా బయటకు తీసి తమకు అనుకూలంగా మల్చుకోవాలనే దానికి కొంత సమయం, సందర్భం అవసరమవుతాయి. కమలనాధులు ఇవేమీ పట్టించుకోలేదు. కోటి మంది మందుబాబులున్నారు. మద్యం ధరలు పెరిగాయి కాబట్టి తక్కువ ధరకు ఇస్తామంటే పుష్పం గుర్తుకు గంపగుత్తగా ఓట్లేస్తారని సోము వీర్రాజు భ్రమపడ్డారు.
మద్యం ధరలు పెంచినప్పుడు కొనుక్కోవడానికి డబ్బులిచ్చిందీ సీఎం జగనే కదా. ఇప్పుడు 20 శాతం తగ్గించారు. మరో ఆర్నెల్లలో మరికొంత తగ్గిస్తే పాత రేటుకే వస్తుంది. అప్పటిదాకా జగనన్న డబ్బులిస్తానే ఉంటాడనే భావనలో మద్యం ప్రియులున్నారు. ఇది గ్రహించని వీర్రాజు రెచ్చిపోయారు. అయినా తక్కువ ధరకు మద్యం ఇస్తామని ఓట్లు ఎవరైనా అడుగుతారా !
ఇంకోనేత సుజనా చౌదరి ప్రత్యేక హోదా ముగిసి పోయిన అధ్యాయమంటూ సెలవిచ్చారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా సంగతి మర్చిపోవాల్సిందేనని పుండుపై కారం చల్లారు. జవడేకర్ ఏం తక్కువ తిన్లేదు. బెయిల్పై ఉన్న నేతలందరూ జైలుకు పోవడం ఖాయమంటూ పరోక్షంగా సీఎం జగన్ను ప్రస్తావించారు. దీన్నే నేలపై నిలబడి ఆకాశంపై ఉమ్మెయ్యడమంటారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు సీఎం వైఎస్ జగన్. అలాంటి నేతపై ఇలాంటి వ్యాఖ్యలు అంతగా నప్పవు.
ఎక్కడైనా కొన్ని వర్గాల్లో అసంతృప్తులుంటే వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికి చాప కింద నీరులా పాకాలి. ఇది కాకుండా ఇలా బహిరంగ సభ పెట్టి ఎవరైనా పరువు తీసుకుంటారా ! అసంతృప్తికి వ్యతిరేకతకు తేడా తెలీకుంటే ఎలా ! బీజేపీపై ఎంతో పగ ఉన్నోళ్లు కూడా ఇలా చేయరేమో ! ఏవిటో రాజుగారు ! అలా పుసుక్కున జరిగిపోయిందంటారా.. ఐతే ఓకే.