సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వీ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయనతోపాటు కలిపి మొత్తం 50 మందితో రాష్ట్ర కార్యవర్గం ఎన్నికయింది. తాడేపల్లిలో మూడు రోజుల నుంచి కొనసాగుతున్న పార్టీ రాష్ట్ర మహాసభలు బుధవారంతో ముగిశాయి. సభల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. దేశ వ్యాప్తంగా హిందుత్వ, కార్పొరేట్ అజెండాను తిప్పికొట్టేందుకు వామపక్ష ఐక్య సంఘటన పాత్రను మరింత బలోపేతం చేసే కార్యాచరణపై మహాసభ చర్చించింది.
వీ శ్రీనివాసరావు సొంతూరు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబం. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో కొనసాగారు. సీపీఎం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. తర్వాత కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా చేశారు. ఈక్రమంలో ఆయన పార్టీ అనుబంధ రైతు సంఘంలో చాలా కాలం బాధ్యతలు నిర్వర్తించారు.
అనేక రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. మధ్యలో కొంతకాలంపాటు ప్రజాశక్తి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విభజన అనంతరం శ్రీనివాసరావు ఎక్కువగా రాష్ట్ర ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు.