2008లో ఓసారి ఏఆర్ రెహ్మాన్ చెన్నైలోని మ్యూజిక్ డైరెక్టర్ వర్షన్ సతీష్ ఇంటికెళ్లారు. వాళ్లు మాట్లాడుతుండగా.. ఓ మూడేళ్ల బుడతడు పియానో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. రెహ్మాన్ యూట్యూబ్‌లో పెట్టిన వందేమాతరం ఓ వీడియో సాంగ్‌ను పియానోపై అద్భుతంగా పలికించాడు. కొద్దిసేపు రెహ్మాన్‌కు నోటమాట రాలేదు. ఎవరీ బుడ్డోడంటూ ఒళ్లోకి తీసుకున్నాడు. ఆ చిచ్చర పిడుగే లిడియన్ నాదస్వరం. పదహారేళ్లకే ప్రపంచ సంగీత ప్రియుల్ని ఊపేస్తున్నాడు. 2019లో ప్రఖ్యాత అమెరికన్ సీబీఎస్ బ్రాడ్‌క్యాస్ట్ స్టూడియో నిర్వహించిన వరల్డ్ మ్యూజిక్ టాలెంట్ షో విజేతగా నిలిచాడు.
వర్షన్ సతీష్, ఝాన్సీ దంపతుల రెండో సంతానం లిడియన్. 2005 సెప్టెంబరు 6న జన్మించాడు. రెండో ఏటనే డ్రమ్స్ ను రిథమిక్‌గా ప్లే చేస్తూ కన్నవాళ్లనే ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అలా ఎదుగుతూ ఎనిమిదో ఏట పియానోతో కుస్తీ పట్టడం మొదలెట్టాడు. ఈ పిల్లాడి ఆసక్తిని కన్నవాళ్లు గుర్తించారు. వర్షన్ సతీష్ స్వయానా మ్యూజిక్ డైరెక్టర్ అయినా బిజీగా ఉంటాడు. అందుకని కుమారుడ్ని వందేళ్ల చరిత్ర కలిగిన మద్రాస్ మ్యూజికల్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టీన్ పౌల్ దగ్గర సంగీతం నేర్చచుకునేందుకు చేర్పించారు.
లిడియన్ నాలుగేళ్లపాటు ఏఆర్ రెహ్మాన్ ఫౌండేషన్ స్థాపించిన కేఎం మ్యూజికల్ కన్సర్వేటరీలో శిక్షణ తీసుకున్నాడు. అమెరికా సీబీఎస్ పోటీల్లో ప్రపంచ విజేతగా నిలవడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. మళయాళంలో నిర్మించిన ‘బార్రోజ్: గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్’ఫాంటసీ చిత్రానికి లిడియన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి మోహన్‌లాల్ దర్శకత్వం వహిస్తూ తానే హీరోగా నటించాడు. అనేక దేశాల్లో నిర్వహించిన కచేరీల్లో పాల్గొని తన టాలెంట్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు.
తర్వాత హిందీలో నిర్మించిన ఓ మ్యూజికల్ డ్రామా ‘అత్కన్ చత్కన్’లో గుడ్డు అనే టీ అందించే కుర్రాడిగా నటించాడు. పియానో, డ్రమ్స్, కీబోర్డు ప్లేలో లిడియన్ నైపుణ్యానికి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లే ఆహా అంటున్నారు. అటు సంగీతంలో.. ఇటు యాక్టర్‌గా బోలెడు అవకాశాలు వస్తున్నాయి. కేవలం పదహారేళ్ల ప్రాయానికే సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న లిడియన్ నాదస్వరం భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిద్దాం.