కరోనా పోయి ఒమిక్రాన్ వచ్చింది. కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. మూడేళ్ల క్రితం నాటి ధరలతో పోలిస్తే నిత్యావసర సరకుల వ్యయం సగటు కుటుంబానికి 33 శాతం పెరిగింది. ప్రజల ఆదాయాలు పెరగలేదు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్యా లేదు. దీంతో దిగువ మధ్య తరగతి సైతం పేదరికంలోకి జారిపోయారు. మద్యం, సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించినట్లు నిత్యావసరాల ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారం ప్రతీ కిరాణా దుకాణంలో సరకులు విక్రయించాలని ఆదేశించండి. ఏ వస్తువు ఏ ధరకు అమ్మాలో బోర్డులు పెట్టించండి. అంతకన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకోండి. సగటు ప్రజలకు ఉపాధి లేదు. ఉపాధి హామీ పథకం కింద ఇక కేంద్రం నుంచి నిధులూ రావు. ఈ స్థితిలో ప్రభుత్వం ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి.
ఓ సామన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంటు దగ్గర నుంచి ఇనుము దాకా ధరలు చుక్కలు చూస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల ఇళ్ల పథకంలో లబ్దిదారులు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులపాలవుతున్నారు. తక్షణమే వారికి పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఇసుక, ఇనుము, సిమెంటును ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించేట్లు చర్యలు తీసుకోవాలి.
నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను వేల కోట్ల ప్రజా ధనంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రులతో పనేంటీ ! అసెంబ్లీలో ఓ తీర్మానంతో ఈ రెండింటినీ నిషేధించండి. ఒక్క దెబ్బతో రాష్ట్రంలోని మద్యం దుకాణాలను సొంతం చేసుకొని ప్రభుత్వం ద్వారా నడిపిస్తున్నారు కదా ! అలాగే ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రులను ఎందుకు రద్దు చేయకూడదు ? పైగా వాటికి అమ్మవడి, ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల సొమ్ము ఇవ్వడం తగునా ! అధికారానికి రాకముందు ప్రతీ ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేటు రంగంలో వాటిని ఎలా ప్రోత్సహిస్తారు సార్ !
రాష్ట్రంలో ఎలాంటి ప్రోత్సాహం లేక కౌలు రైతులు అల్లాడుతున్నారు. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు నమోదు ప్రక్రియను ఆర్బీకేలు చేపట్టాలి. ఈ క్రాప్ నమోదుకు భూ యజమానులకు లింకు పెట్టడం సరికాదు. వ్యవసాయంలో మూడింట రెండొంతులు కౌలు సాగే నడుస్తోంది. అలాంటి కౌలు రైతులకు పంట రుణ: దగ్గర నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చేవరకు, తిరిగి పంట కొనుగోలు చేసేట్లు ఆర్బీకేలను తీర్చిదిద్దాలి. పంటల సాగుకు పెట్టుబడులు పెరిగాయి. బ్యాంకులు అందించే వివిధ పంట రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచాలి. ఒక్కసారి ఆలోచించండి సీఎం సార్ !

“ సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించారు. మద్యం రేట్లూ తగ్గించారు. అదే చేత్తో నిత్యావసర సరకుల ధరలు తగ్గించండి. సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుక, ఇనుము, సిమెంటు ధరలు తగ్గించాలి. ఓవైపు వేల కోట్ల ప్రజాధనంతో నాడు –నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేస్తున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రులతో పనేంటీ ! అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ పేరుతో వాటికి ప్రజల సొమ్ము ఎందుకు దోచిపెడుతున్నారు ! తమిళనాడులో మాదిరిగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయండి సీఎం సార్ !” అంటూ సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.