ఓ మట్టిగడ్డ.. ఓ ఆకు చెలిమి చేశాయి. జీవితంలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఓ రోజు గాలి దుమారం లేచింది. ఆకు గాలికి కొట్టుకుపోకుండా మట్టిగడ్డ కాపాడింది. తర్వాత కొన్నాళ్లకు భారీ వర్షం కురిసింది. మట్టిగడ్డ కరిగి పోకుండా ఆకు అడ్డుకుంది. చెట్టాపట్టాలేసుకొని నడుస్తున్న కాలంలో ఉన్నట్టుండి గాలివాన రెండూ ఏకమై విజృంభించాయి. ఆకు గాలికి కొట్టుకుపోయింది. మట్టిగడ్డ కరిగిపోయింది. ఇదే ‘లూకా అలియాస్ జానీ’రొమాంటిక్ మిస్టరీ లవ్ స్టోరీ. చిత్రం ముగింపులో బ్యాక్ గ్రౌండ్ నుంచి ఈ కథ వినిపిస్తుంది.
కథలోకి వెళ్తే.. జానీ (టొవినోథామస్) మరణిస్తాడు. అతని మరణం మిస్టరీగా మారుతుంది. పోలీసు అధికారి అక్బర్ కేసును శోధిస్తుంటాడు. అక్బర్ కు తన భార్యతో ఇమడలేకపోతుంటాడు. విడాకులు తీసుకోవాలనుకుంటారు. అంతకముందు ఓ అమ్మాయిని ప్రేమించిన జ్ఞాపకాల నుంచి అక్బర్ బయటపడలేకపోతుంటాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా భార్యతో ముభావంగా ఉంటాడు. తన పెంపుడు పిల్లితోనే కాలం వెళ్లదీస్తుంటాడు. ఇప్పుడు జానీ మృతి కేసులో ఎటువంటి ఆధారం దొరక్క సతమతమవుతుంటాడు. జానీ ఇంట్లో అతని ప్రియురాలు నిహారిక (అహనా కృష్ణకుమార్) డైరీ దొరుకుతుంది. డైరీలో జానీ గురించి మరింత సమాచారం లభ్యమవుతుంది.
జానీ బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురై ఏదైనా చావును చూస్తే అతని మస్తిష్కం పనిచేయదు. కుప్పకూలిపోతుంటాడు. ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడేందుకు అతను నేర్చుకున్న పెయింటింగ్ తోడ్పడుతుంది. పనికిరాని చిన్నచిన్న వస్తువులతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తుంటాడు. ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో నిహారిక బెనర్జీ పరిచయమవుతుంది. కొట్లాటతో ఏర్పడిన పరిచయం ప్రేమ దాకా తీసుకెళ్తుంది. కెమికల్ ఇంజనీరింగ్లో ప్రాజెక్టు వర్క్ నిమిత్తం వచ్చిన నీహారిక మూడు నెలలపాటు జానీ ఇంట్లోనే ఉంటుంది.
నిహారిక చిన్నతనంలో మేనమామ సెక్సువల్ హెరాస్మెంటుకు గురవుతుంది. ఆ ఘటన నుంచి ఆమె బయటపడలేక పోతుంటుంది. జానీతో కలిసుంటే అవన్నీ మర్చి పోయి ఆమెకు హాయిగా ఉంటుంది. ఇద్దరూ ఒకరోజు బైక్ పై వెళ్తుండగా జానీ ఒక్కసారిగా కళ్లు కనిపించడంలేదని కిందపడిపోతాడు. నిహారిక అతన్ని ఆస్పత్రిలో చేరుస్తుంది. పరీక్షలు చేసిన వైద్యులు జానీకి వాళ్లమ్మ మాదిరిగా సెలిబ్రల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఎప్పుడైనా మరణం సంభవించ వచ్చని చెబుతారు. అక్కడ నుంచి జానీ నీహారికను వాళ్ల ఊరు పంపించేస్తాడు.

జానీని మర్చిపోలేక అతనికి సుఖమైన చావును ప్రసాదించడం కోసం నిహారిక ఓ ఆలోచనకు వస్తుంది. ఏదైనా పుస్తకంలో పేజీలు తిరగేసేటప్పుడు నోటితో తడి చేసుకోవడం జానీకి అలవాటు. దీంతో విషపూరితమైన కెమికల్ను ఆమె డైరీలోని పేజీలకు రాసి జానీ కి పంపుతుంది. జానీ లేకుండా జీవించలేనని ఆత్మహత్య చేసుకుంటుంది. డైరీ చదివిన కొద్ది గంటల్లోనే జానీ చనిపోతాడు.
అక్బర్ డెయిరీని చదివి పక్కన పెడితే ఆ పేజీలను నాకిన అతని పెంపుడు పిల్లి చనిపోతుంది. ఈకేసు ఓ కొలిక్కి రావడంలో సహకరించిన భార్యతో పోలీసు అధికారి అక్బర్ సానుకూలంగా మారిపోతాడు. బ్యాక్ గ్రౌండ్లో మట్టిగడ్డ, ఆకు చెలిమి కథ వినిపించడంతో శుభం కార్డు పడుతుంది.
రెండేళ్ల క్రితం మళయాళంలో నిర్మించిన లూకా చిత్రం బాక్సాఫీసులను బద్దలు కొట్టింది. తర్వాత తెలుగులో డబ్ చేశారు. ఈ ఏడాది మార్చిలో ‘ఆహా’ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ప్రేక్షకులకు ‘లూకా అలియాస్ జానీ’పేరుతో అందుబాటులోకి వచ్చింది. తెలుగు సినిమాలకు భిన్నంగా దక్షిణాది మళయాళం, తమిళం, కన్నడ చిత్రాలు కథను డిమాండ్ చేస్తాయి. కథ డిమాండ్ మేరకే పాత్రలుంటాయి. హీరోహీరోయిన్ల ఎలివేషన్స్ ఉండవు. సినిమా కథే ఈ చిత్రాల్లో హీరో. ఇంకా దర్శకుని ప్రతిభ కనిపిస్తుంది. సంగీతానికి అంత ప్రాధాన్యం ఉండదు. హుస్సేన్, లింటో థామస్ నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్బోస్ దర్శకత్వం వహించారు.