తిరుమల తిరుపతి దేవస్థానమే ప్రపంచ వ్యాప్తంగా ఓ బ్రాండ్ అంబాసిడర్. అలాంటి టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అమ్మడానికి మరో మార్కెటింగ్ ఏజెన్సీ అవసరం ఏమొచ్చింది ? అమెజాన్‌కు ఎందుకిచ్చారు ! సదరు సంస్థ వాస్తవ ధరలకు అధికంగా విక్రయించి టీటీడీ పరువు దీస్తుంటే యాజమాన్యం చూస్తూ ఎలా ఊరుకుంది ! భక్తులకు ఎవరు సమాధానం చెబుతారు !
పాలక మండలి నిర్ణయం లేకుండా ఏం జరగదు. ఇది చాలదన్నట్లు టీటీడీకి మింత్రా కంపెనీ సీఈవోను సలహాదారునిగా నియమించారు. ఏ అంశాల్లో టీటీడీకి సలహాలు అవసరముంది ! ఫక్తు వ్యాపార ధృక్పథంతో పనిచేసే కార్పొరేట్ కంపెనీల సీఈవోలను నియమించడం ద్వారా భక్తులకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు ! వీటిపై భక్తులకు టీటీడీ పాలక మండలి వివరణ ఇవ్వాల్సిన అవసరముంది.
టీటీడీ ప్రచురించిన నూతన సంవత్సరం క్యాలెండరు ధర రూ. 15. అమెజాన్ కంపెనీ ఆన్లైన్లో రూ.300 ధర నిర్ణయించింది. అందులో 50 శాతం రాయితీతో రూ. 149కు విక్రయిస్తుంది. ఇది భక్తులను దోచుకోవడం కాదా ! బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారి పట్ల తన సొంత ఉద్యోగులైనా, దళారులైనా టీటీడీ కఠినంగా వ్యవహరిస్తుంది. మరి అమెజాన్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది !

దేశవ్యాప్తంగా కల్యాణ మండపాలు, పెద్ద వ్యవస్థ కలిగిన టీటీడీ అమెజాన్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్లో టికెట్లను విక్రయించే టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో విక్రయించలేదా ! అసలు అమెజాన్‌తో ఎవరు ఒప్పందం చేసుకున్నారనే వివరాలు బహిర్గతం చేయాలి.
తాజాగా మింత్రా కంపెనీ సీఈవోను సలహాదారులుగా నియమించారు. ఓ ధార్మిక సంస్థకు సదరు సీఈవో ఏం సలహాలు ఇస్తారనేది నియమించిన వాళ్లకే ఇవ్వాలి. చివరకు శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తారేమోనంటూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆందోళనకు దిగారు. కార్పొరేట్ కంపెనీతో ఎవరు ఒప్పందం చేసుకున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న తీరును ఎండగట్టారు. తక్షణమే ఈ నిర్ణయాలపై పాలకమండలి నోరు విప్పాలని సీపీఎం తిరుపతి కార్యదర్శి వందవాసి నాగరాజు కోరుతున్నారు.
అసలు టీటీడీలో ఏం జరుగుతుందో స్పష్టం చేయాలి
కందారపు మురళి, సీఐటీయూ నేత
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని సీఐటీయూ నేత కందారపు మురళి ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్ సంస్థ అధిక ధరలకు టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అమ్ముకునే దందాకు ఎవరు అనుమతిచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. మింత్రా కంపెనీ సీఈవోను సలహాదారుగా నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. సమర్థులైన సాంకేతిక సలహాదారును నియమించుకోవడం తప్పేమీ కాదు. ఆ పేరుతో కార్పొరేట్ కంపెనీల సీఈవోలను నియమిస్తూ ధార్మిక క్షేత్రంలో వివాదాస్పద నిర్ణయాలు చేయడం సమంజసం కాదని మురళి హితవు పలికారు. ఈ నిర్ణయాలపై టీటీడీ పునరాలోచించాలని కోరారు.
టీటీడీ క్యాలెండర్లు, డైరీలను కొందరు వ్యక్తులు అమెజాన్ సంస్థ ప్లాట్‌ఫాం నుంచి అధిక ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వెంటనే అధిక ధరలకు విక్రయించడాన్ని నిలిపివేయించినట్లు పేర్కొంది. అధిక ధరలకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని అమెజాన్ సంస్థను కోరినట్లు టీటీడీ భక్తులకు తెలియజేసింది.