‘ఐ మిస్ యూ మామ్’అంటూ శామ్యూల్ కన్నీళ్లు తుడుచుకుంటూ బయల్దేరతాడు. ప్రయాణంలో ఆకలేస్తుందని ఆ తల్లి రొట్టెలు మూట గట్టి పెడుతుంది. శామ్యూల్ చెల్లెలికి రెండు చెవి దుద్దులు కొనిస్తుంది. ఇంకో తల్లి దుబాయ్ నుంచి వాచీ తెప్పించి శామ్యూల్‌కు బహూకరిస్తుంది. ఇంటి నుంచి నాలుగడుగులు వేసిన శామ్యూల్ మళ్లీ వెనక్కి వచ్చి ఆ తల్లులను అల్లుకుపోతాడు. ఒక్కసారిగా హృదయాలన్నీ బరువెక్కుతాయి. తానెవరో.. ఆ తల్లులెవరో. ప్రేమకు ఎల్లలుంటాయా ! ఆత్మీయతకు జాతి, దేశం అడ్డొస్తాయా ! ‘సుడానీ ఫ్రం నైజీరియా’చిత్రంలోని చివరి సన్నివేశం గుండెను పిండేస్తుంది.
నైజీరియా ఫుట్‌బాల్ ప్లేయర్ శామ్యూల్‌ను కేరళకు చెందిన ఓ క్లబ్ తరపున ఆడేందుకు పిలుస్తారు. అతను వచ్చింది నైజీరియా నుంచి అయినా సుడాన్ నుంచి వచ్చాడనుకొని సుడానీ అని పిలుస్తుంటారు. తాను సుడాన్ వాసిని కాదన్నా సుడానీ అనే అంటుంటారు. ఆటలో సక్సెస్‌తో దూసుకుపోతున్న శామ్యూల్ ఓ రోజు బాత్రూంలో కాలు జారి పడతాడు. మడమకు, చేతికి తీవ్ర గాయాలవుతాయి. సర్జరీ, ఫిజియో థెరపీ చేయాల్సి వస్తుంది. శామ్యూల్‌కు వైద్యం చేయించాల్సిన బాధ్యత క్లబ్ మేనేజరు మజీద్ రెహ్మాన్ దే. ఆస్పత్రిలో బిల్లు కట్టడానికే మజీద్ స్నేహితుడి నగలు తాకట్టు పెడతాడు.
ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంటు ఇప్పించలేక శామ్యూల్‌ను ఇంటికి తీసుకొస్తాడు. అప్పటిదాకా తల్లితో మజీద్‌కు సరిగ్గా మాటల్లేవ్. మజీద్ బాల్యంలోనే అతని తండ్రి చనిపోతాడు. తల్లి మరొకరిని వివాహం చేసుకుంటుంది. అతన్ని తండ్రిగా మజీద్ అంగీకరించలేడు. దీంతో వాళ్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయినా శామ్యూల్‌ను తాను చూసుకుంటానని తల్లి ముందుకొస్తుంది. బెడ్ మీద పడుకొని ఉండే శామ్యూల్‌కు అన్ని సేవలు చేస్తుంది. వేళకు తిండి పెడుతూ మందులిస్తూ కన్నబిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. ఆమెకు తోడుగా స్నేహితురాలు సహకరిస్తూ ఉంటుంది.

ఓ రోజు శామ్యూల్ బెడ్‌పై వెక్కివెక్కి ఏడుస్తుంటాడు. ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. ఏంటని మజీద్ అడిగితే ‘నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నైజీరియాలో అమ్మ, చెల్లెళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్లకు పంపేందుకు డబ్బుల్లేవు. నేను మా దేశం వెళ్లిపోతా. నన్ను ఎలాగైనా పంపించండంటూ’బావురుమంటాడు. మజీద్ అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉంటాడు. అయినా ఎక్కడో చోట అప్పు చేసి పంపుతానని అనునయిస్తాడు. మజీద్ మరోవైపు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువవుతాయి. ఓ ఇమ్మిగ్రెంట్ను ఇంట్లో ఎలా పెట్టుకుంటావని పలుమార్లు స్టేషన్‌కు తీసుకెళ్తారు. స్పెషల్ బ్రాంచి పోలీసులకు అతని పాస్‌పోర్టుపై అనుమానం వస్తుంది.
శామ్యూల్‌ను ఆస్పత్రిలో చేర్చేటప్పుడు అతని పాస్‌పోర్టు ఎక్కడ పెట్టారో గుర్తుండదు. దాని కోసం వెతుకలాడుతుంటారు. డూప్లికేట్ పాస్‌పోర్టు తెప్పిస్తానంటే శామ్యూల్ ఒప్పుకోడు. తనది ఫేక్ పాస్‌పోర్టు అని చెబుతాడు. దీంతో మజీద్ బిత్తరపోతాడు. శామ్యూల్‌ను ఎలాగైనా నైజీరియా పంపడానికి నానా అవస్థలు పడతాడు. చివరకు విమానం టిక్కెట్ తీసి ఇవ్వగలుగుతాడు.
గాయాల నుంచి తేరుకున్న శామ్యూల్ అక్కడ నుంచి ప్రయాణమవుతుంటే.. అప్పటిదాకా పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాలు కదలనీయవు. హృదయాలను కట్టిపడేస్తాయి. శామ్యూల్‌కు ఎయిర్ పోర్టులో సెండాఫ్ ఇచ్చాక నేరుగా తన తండ్రి వద్దకెళ్తాడు. అతన్ని ఇంటికి తీసుకెళ్తాడు. మజిద్ తల్లి ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. ప్రతీ సన్నివేశం గుండెలను హత్తుకుంటుంది.
2018లో విడుదలైన ఈ మళయాల చిత్రం కేరళ స్టేట్ ఫిల్మ్ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. మజిద్ రెహ్మాన్గా సౌబిన్ షాహిర్ నటన అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు జకారియా మహ్మద్ స్క్రీన్ ప్లే కేక పుట్టిస్తుంది. ఆద్యంతం సినిమా కథ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. నైజీరియా ఫ్రెండుతో వచ్చీరాని ఇంగ్లిష్‌లో మాట్లాడే మజిద్ పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. అసలు విశేషమేమంటే.. నిర్మాతలు సమీర్ తాహిర్, షైజు ఖలిద్ ఈ చిత్రాన్ని కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగులో డబ్ చేశాక ప్రస్తుతం ‘ఆహా’ఓటీటీలో ప్రేక్షకులను ఈ చిత్రం ఓలలాడిస్తోంది.
తెలుగిల్లు పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు