ఏపీకి ఇప్పుడు మంచి ప్రతిపక్షాల అవసరముందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న వాటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. లేదంటే మీకు నచ్చిన ఓ ప్రతిపక్షాన్ని మీరే ప్రవేశ పెడితే గొడవ వదిలిపోతుంది కదా ! నిజానికి ఏనాడైనా.. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను సంప్రదించిందా ! ప్రజలకు మంచి చేయడానికి విధి విధానాలు అమలు చేసే ముందు ప్రతిపక్షాల ముందుంచారా ఎన్నడైనా ! అసలు ఆ సంస్కృతి ఉందా మీకు ! ప్రతిపక్షాల్లో ఏది మంచిదో.. మరేది చెడ్డదో ఎలా నిర్ధారిస్తారు సార్ !
అమరావతికి బదులు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనేది కేవలం వైసీపీ సొంత వ్యవహారం కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఎప్పుడైనా ప్రతిపక్షాలతో చర్చించారా.. కనీసం సంప్రదించారా అంటే లేదు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి సొంత ఇంటి కల నెరవేర్చాలనుకున్నప్పుడైనా ప్రతి పక్షాలు గుర్తు రాలేదా !
నాడు–నేడు కింద వేల కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయిస్తున్నారు. అప్పుడైనా ఎలా చేస్తే బావుంటుందనే ఒక్క మాట ప్రతిపక్షాలను అడిగారా ! అంతెందుకు ! పాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు గ్రామ సచివాలయాలు, వలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు మాటవరసకైనా ప్రతిపక్షాలకు చెప్పారా ! అదీ లేదు.
నిన్నమొన్న తీసుకొచ్చిన ఓటీఎస్ పథకం విషయంలోనూ ఒంటెద్దు పోకడ పోతుంది ప్రభుత్వమే. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ప్రతిపక్షాలు చొరవ చూపినా ప్రభుత్వంలో స్పందన లేదు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రాన్ని నిలదీద్దాం కలిసిరండని విపక్షాలు గొంతు చించుకున్నా ప్రయోజనం లేకపోయింది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పిల్లి మొగ్గలు వేస్తోంది. పెరిగిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వకుండా కొర్రీలు వేస్తోంది. దీనిపై కేంద్రాన్ని నిలదీద్దామని విపక్షాలు అడుగుతున్నా ప్రభుత్వం నుంచి మౌనమే సమాధానమవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు బాగలేవని బద్నాం చేయడం విడ్డూరంగా ఉంది.
ఇప్పటిదాకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రధాన ప్రతిపక్షం గుడ్డిగా వ్యతిరేకించి ప్రజల్లో అభాసుపాలవుతూ వచ్చింది. ఇళ్ల పట్టాల విషయంలో కోర్టుల్లో కేసులు వేసింది. మూడు రాజధానుల అంశంతోపాటు ఇంకా అనేక విషయాల్లో టీడీపీ న్యాయ స్థానాలను ఆశ్రయించడం, అక్కడ ప్రభుత్వ జీవోలు న్యాయ సమీక్షకు నిలవకపోవడం పరిపాటిగా మారింది. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తులున్నా అవి ప్రతిపక్ష బలం పెరగడానికి దోహదపడడం లేదు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో ప్రజలు తమకు ఓటేయలేదనే ఉక్రోషం వెళ్లగక్కుతున్నారు.
అందువల్ల టీడీపీ ప్రతిపక్షంగా మీకు అక్కర్లేదనుకుంటే మిగతా పక్షాల్లో ఏదో ఒకటి ఎంచుకోండి సార్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ముందుగా మీరు ఎంచుకున్న ప్రతిపక్షానికైనా తెలియజేయండి. చర్చించండి. ప్రతిపక్షం సలహాలను తీసుకొని విధి విధానాలు అమలు చేయండి. ప్రతిపక్షాన్ని కలుపుకొని కేంద్రంపై రావాల్సిన వాటి కోసం కొట్లాడండి. అప్పుడే అది ప్రజాస్వామ్యయుత పాలన అనిపించుకుంటుంది.