వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపొద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావొద్దని వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. జనవరి 12 నుంచి 22 దాకా పది రోజులపాటు ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా దర్శనం చేసుకోవడం వరకే పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. ముందుగా ఆన్లైన్లో టిక్కెట్లు పొందిన సామాన్య భక్తులకు అసౌకర్యం లేకుండా చూడడం టీటీడీ బాధ్యతని గుర్తు చేశారు. చైర్మన్ కార్యాలయంలో కూడా ఈ రోజుల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోరని చెప్పారు.
కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమల లో ని నందకం, వకుళ ఆతిథి గృహాల్లోవసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ తిరుమలలో వసతి సరిపోకుంటే తిరుపతి లోనే బస చేసేందుకు సిద్దమై రావాలని వీఐపీలకు సూచించారు. శ్రీవాణి ట్రస్టు భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ సూచించారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.
డీపీఆర్ సిద్ధం చేయండి
అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు వెంటనే డీపీఆర్ సిద్దం చేయాలని చైర్మన్ వైవీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం దాకా ఉన్న అన్నమయ్య మార్గాన్ని పరిశీలించారు. తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన ఈ మార్గం ద్వారా భక్తులు నడక, వాహనాల ద్వారా తిరుమల చేరుకునేందుకు అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. కడప వైపు నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం అనువుగా ఉంటుందన్నారు. వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మొత్తం 23 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఘాట్ రోడ్లలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా ఇది ప్రత్యామ్నాయ మార్గంలా ఉపయోగపడుతుందని వైవీ వివరించారు.