కేంద్రంతో తాడో పేడో తేల్చుకోలేడు. అలాగని గమ్మునుంటే మునిగిపోతాడు. ఇదీ ఏపీ సీఎం జగన్ దుస్థితి. ఈరోజు ఢిల్లీ పయనమవుతున్నారు. సాయంత్రం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కలుస్తారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితి నుంచి పోలవరం, మూడు రాజధానులు, ఇతర విభజన హామీల గురించి చర్చిస్తారనేది పార్టీ వర్గాల నుంచి సమాచారం. నేడు బీజేపీనే మునిగిపోయే నావలాంటిదని తెలుస్తోంది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుందనేది ముందస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల నుంచి సీఎం జగన్‌కు తీవ్రమైన ఒత్తిడులున్నాయి. ఇప్పుడు కూడా కాస్త గట్టిగా నిలేయకుంటే నిలబడే పరిస్థితి లేదు. ఇంతకీ సీఎం ఎలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశమైంది.
విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో సీఎం జగన్ సూచనలను కేంద్రం బేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. విక్రయమో, మూసివేతో తప్పదన్నట్లు కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఇది సీఎం జగన్‌ను ఉత్తరాంధ్రలో బాగా ఇరుకున పెడుతుంది. రెండోది పోలవరం. దీనిపైనా పెరిగిన అంచనా ప్రకారం రూ.55,564 కోట్లకు ఆమోదించేది లేదంటోంది. కనీసం రూ.47 వేల కోట్ల పై చిలుకు వరకైనా అంగీకరిస్తారన్న విశ్వాసం లేదు.
కొద్దిసేపు మంచినీటి పథకం ప్రాజెక్టులో భాగం కాదంటుంది. ఇంకొద్దిసేపు 2013 కు ముందు అంచనాల ప్రకారమే ఇస్తామంటుంది. ఇలా రోజుకో రకంగా పిల్లి మొగ్గలు వేస్తోంది. నేటికీ పునరావాసానికి సంబంధించి 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ ప్రతిష్టను ఇది దారుణంగా దెబ్బతీస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహించి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయించింది. దానికి సంబంధించి సుమారు రూ.6 వేల కోట్లకుపైగా బకాయి రావాల్సి ఉంది. కేసీఆర్ ను అడిగితే విభజిత ఆస్తులకు సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నందున తాము ఇప్పుడు చెల్లించలేమని చేతులెత్తేశారు. కనీసం కేంద్రం జోక్యం చేసుకొని ఆ బకాయి ఇప్పించమంటే.. మీరూమీరూ జుట్లు పట్టుకొని తేల్చుకోమని చావు కబురు చల్లగా చెబుతోంది. దీంతో సీఎం జగన్ కు ఏం పాలుపోవడం లేదు. ఇదిగాక ఇంకా రెవెన్యూ డెఫిసిట్‌కు సంబంధించి కొంత కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కనీసం వాటి గురించి అయినా పట్టుబట్టాల్సి ఉంది.
ఇక మూడు రాజధానులపై కేంద్రం వైఖరిని ఈపాటికే అమిత్‌షా స్పష్టం చేశారు. తాము అమరావతికే కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తేవాలని భావిస్తోంది. ఈపాటికే అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రపంచబ్యాంకు అప్పు కోసం ప్రతిపాదనలున్నాయి. సుమారు రూ. 50వేల కోట్ల రుణం తీసుకోవాలని నాడు భావించారు. ఇప్పుడు మూడు రాజధానులంటే ప్రపంచబ్యాంకు అంగీకరిస్తుందా.. రుణం ఇస్తుందా.. మోకాలడ్డుతుందా అనేది స్పష్టత లేదు.
ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న మూడు నెలలకు ముందస్తు అంచనా ప్రకారం రూ.23 వేల కోట్లకు పైగా రుణం కావాల్సి ఉంది. రూ.8 వేల కోట్లకే అనుమతి ఉంది. దీన్ని పెంచాలని కోరాల్సి ఉంది. ఇవిగాక వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రమేయం, సీబీఐ, ఈడీ కేసులు సీఎం జగన్‌ను బాగా చికాకు పెడుతున్నాయి. ఈ అంశాలన్నింటిపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.