సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీని కలిశారు. ఏడు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రం సమర్పించారు. వాటిని ఆమోదించి నిధులు ఇస్తామన్నారా ! లేదా కొన్నింటికే ఆమోదం తెలిపారా ! అసలు ఇవ్వడం కుదరదన్నారా ! ఓ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితిని దేశ ప్రధాని ముందు పెడితే.. కనీస స్పందన లేకపోవడం విడ్డూరం. రాష్ట్ర ప్రజలకు ప్రధాని ఏం చెప్పదల్చుకున్నారు ! ఇదేదో వాళ్లిద్దరి వ్యక్తిగత వ్యవహారం కాదు కదా ! ఏదో దేవుడి ముందు వినతి పత్రం పెట్టినట్టో.. విగ్రహానికి విజ్ఞాపన చేసినట్టో ఉంది. ఇక అంతా దైవేచ్చేనేమో.
గతంలో ఓ ముఖ్యమంత్రి, ప్రధాని భేటీ అయితే ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చిస్తారు. అనంతరం మీడియాకు చర్చల వివరాలు తెలియజేస్తారు. తామేం అడిగామో సీఎం తెలిపేది. తాము ఏం చేయదల్చుకున్నామో ప్రధాని వివరించేది. ఈ పద్దతి పోయింది. తర్వాత కొన్నాళ్లకు రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రధానితో చర్చించాక సదరు సీఎం ప్రసార సాధనాలతో మాట్లాడేది. తాము ఏమడిగాం.. ప్రధాని ఏం చేస్తామని హామీ ఇచ్చారనేది తెలిజేస్తుండేది. ఇప్పుడు ఆ రెండు పద్దతులూ పోయాయి. కేవలం విజ్ఞాపన పత్రం దేవుడి ముందు ఉంచి దణ్ణం పెట్టి రావడమే. ఆ తర్వాత దైవానుగ్రహం.
సీఎం జగన్ ప్రధాని ముందు పెట్టినవి ధీర్ఘ కాలిక అభివృద్ధికి సంబంధించిన అంశాలేమీ కాదు. తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు. అందులో విభజన అనంతరం రెవెన్యూలోటుకు సంబంధించి రూ.18,880 కోట్లదాకా కేంద్రం ఇవ్వాలి. దీని వల్ల ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం జారిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ చేసే వింత వాదనలపై అక్కడక్కడే ప్రధాని మాట్లాడి చెప్పొచ్చు. విభజన అనంతరం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని నాడు కోరింది కేంద్రమే. ఇప్పుడు ఆ సొమ్ము ఇప్పించకుండా మొహం చాటేయడాన్ని ఏమంటారు !
కడప స్టీల్ ప్లాంటుకు క్యాప్టివ్ మైన్స్ అడిగారు. వేలంలో కొనుక్కోవాలని కేంద్రం అంటోంది. విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన దానికీ ఇలా కొర్రీ వేస్తారా ! కరోనా పరిస్ధితుల్లో ఇబ్బందుల వల్ల రుణం పెంపునకు అనుమతులు ఇవ్వాలని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 లక్షల బీపీఎల్ కుటుంబాలకు రేషన్ అందిస్తోంది. ఈ భారాన్ని తగ్గించమని కోరారు. ఇవన్నీ ప్రధాని వెనువెంటనే స్పష్టతనివ్వాల్సిన అంశాలే. వినతి పత్రం తీసుకొని ఎలాంటి ప్రకటన చేయకపోవడం దేనికి సంకేతం ! ఇది రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించడం కాదా !