“భావితరం ఇంజనీర్లను తయారు చేసేవాళ్లం. పూట గడవక అల్లాడుతున్నాం ! నిబంధనల ప్రకారం జీతాలు ఇవ్వడంలేదు. వేతనం అందుకొని 9 నెలలైంది. ఎలా బతకాలో తెలీడంలేదు. ఈపాటికే కొందరు బేల్దారీ పనులకు పోతున్నారు. ఇంకొందరు కూరగాయలు అమ్ముకుంటున్నారు. మరికొందరు ఉపాధి పనికి పోతున్నారు. మా గోడు పట్టించుకోండి సీఎం సార్!” అంటూ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ బ్రహ్మానందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుమారు 427 కళాశాలలున్నాయి. వాటిల్లో సుమారు లక్ష మందికిపైగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్ ఆంక్షలతో కళాశాలలకు విద్యార్థులు హాజరవడం లేదు. ఆన్ లైన్ క్లాసులు మాత్రం నడుస్తున్నాయి. కళాశాలలకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు వస్తోంది. అయినా దాదాపు 9నెలల నుంచి సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. గట్టిగా ప్రశ్నిస్తే ఉద్యోగం పీకేస్తున్నారు.
సమస్యను ఏఐసీటీఈ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేసేవాళ్లంతా సాధారణ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అధ్యాపక వృత్తి నుంచి బయటపడి మరో చిన్నాచితకా పనులు చేసుకోలేక వేతనాలు అందకున్నా అలాగే కునారిల్లుతున్నారు.
ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం అసిస్టెంటు ప్రొఫెసర్‌కు రూ.40 వేలకు పైగా ఇవ్వాలి. ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఈ వేతనం ఇవ్వడం లేదు. రూ.15 వేల నుంచి రూ.20వేలలోపు ఇస్తున్నారు. ఆ వేతనాలు కూడా ఇప్పుడు సక్రమంగా ఇవ్వడం లేదు. ఏఐసీటీఈ కి ఫిర్యాదు చేస్తే నెలానెలా నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని యాజమాన్యాలకు తాము కూడా చెప్పామంటున్నారు. అంతేతప్ప కళాశాలల యాజమాన్యాలను శాసించే స్థితిలో ఏఐసీటీఈ లేదు. దీనిపై సీఎం జగన్ పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతినెలా ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం వేతనాలు ఇప్పించాలని కోరుతున్నారు.