సచివాలయ ఉద్యోగుల ఆందోళన.
పీఆర్సీ ఫిట్మెంటుపై ప్రభుత్వ ఉద్యోగుల తిరుగు బావుటా.
సుబాబుల్, జామాయిల్ రైతుల కన్నెర్ర.
పంట రుణాలు అందక కౌలు రైతుల ఆక్రోశం.
పనుల్లేవంటూ భవన నిర్మాణ కార్మికుల నిరాశా నిస్పృహలు.
నిత్యావసరాల ధరలు కొండెక్కాయంటూ సగటు ప్రజల నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వానికి అన్నీ చుక్కెదురే.
మా ప్రభుత్వం బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.
మాకు ప్రజల్లో తిరుగులేని ఆదరాభిమానాలున్నాయి.
ఇదంతా ప్రతిపక్షాల గోలంటూ అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
సీఎం జగన్ చుట్టూ చేరి భజన చేసేస్తున్నారు.
అంతా బ్రహ్మాండంగా ఉందంటూ తెగ మోసేస్తున్నారు.
సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఉద్యోగాలిచ్చింది ఈ ప్రభుత్వమే.
రెండేళ్లయినా వాళ్ల ప్రొబేషన్ కొనసాగించడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
మళ్లీ పరీక్ష పాసయితేనే ప్రొబేషన్ పూర్తియినట్లు పరిగణిస్తామంటున్నారు.
ఇలా పూటకో ప్రకటన.. రోజుకో మాట చెబుతున్నారు.
ఇప్పుడు మళ్లీ జూన్ దాకా వాయిదా వేయడాన్ని నిరసిస్తున్నారు.
సుబాబుల్, జామాయిల్ టన్నుకు రూ.5 వేల ధర ఇప్పిస్తామని నాడు సీఎం జగన్ హామీనిచ్చారు.
మిల్లర్లతో మాట్లాడి ఈమేరకు ధర ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
దీనిపై వేసిన మంత్రి వర్గ ఉప సంఘం ఏమైందో తెలీదు.
సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకుంటే అరెస్టు చేస్తారా అంటూ రైతులు కన్నెర్రజేస్తున్నారు.
ఎస్ఎల్బీసీలో సీఎం ప్రకటించిన మేరకు కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు.
దీని గురించి పట్టించుకున్న నాథుడు లేడు.
భవన నిర్మాణ కార్మికులకు పనులు తగ్గిపోయాయి.
ఇసుక, సిమెంటు, ఐరన్ ధరలు విపరీతంగా పెరిగాయి.
దీంతో బిల్డర్లు పనులు చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదు.
కనీసం కార్మికుల ఫండ్ నుంచి అయినా తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఇంకోవైపు గోరుచుట్టుపై రోకలి పోటులా నిత్యావసర ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి.
పూట గడవడం కష్టమవుతోందని సగటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం గారూ.. ఒక్కసారి ప్రజల బాధలు కనండి సార్ !