దివంగత ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 26వ జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు, అభిమానులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర టీడీపీ నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడినట్లు చెప్పారు. జీవిత, రాజశేఖర్ లు తనను మద్రాస్ కు పిలుచుకుపోయి ఓ అమ్మాయితో మాట్లాడించారని… ఆ 16 ఏళ్ల అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించి తనతో మాట్లాడిందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ తనతో ఎన్నో విషయాలను పంచుకుందని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న అంశంపైనా లక్ష్మిపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయించడం ద్వారా సీఎం జగన్ చాలా హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు. దుర్గిలో విగ్రహ ధ్వంసంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. తెలుగు ప్రజలపై ఎన్టీఆర్ చూపు ఉండాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు.