ఏడు దశాబ్దాల స్వతంత్రం అడవి బిడ్డల దరి చేరలేదు.
నేటికీ గుర్తింపునకు నోచుకోని కొండ జాతులెన్నో.
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి ఎన్నితిప్పలో.
కార్పొరేట్ల సేవలో తరిస్తోన్న ఆటవిక ప్రభుత్వాల డొల్లతనాన్ని ‘తేన్’చిత్రం కళ్లకు కట్టింది.
బ్యూరోక్రసీ నీచత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలిపింది.
అది నాగరిక ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉన్న కురింజి హిల్ ఏరియా.
అక్కడక్కడా విసిరేసినట్టుండే ఇళ్లు.
వేళ్లపై లెక్కపెట్టగలిగినన్ని కుటుంబాలు.
అడవిని నమ్ముకొని జీవిస్తున్నాయి.
వేలు(తరుణ్) తేనె తీస్తూ బతుకుతుంటాడు.
దాంతో మూలికా వైద్యం చేస్తుంటాడు.
పూన్కుడి(అబర్నతి)తో పరిచయమవుతుంది.
పెళ్లికి గ్రామ దేవత అనుగ్రహం లేదని పెద్దలు నిర్ణయిస్తారు.
అయినా పెద్దలను కాదని ఒక్కటవుతారు.
వాళ్లకో పాప పుడుతుంది. పుట్టుకతోనే మూగ.
సంతోషంగా రోజులు గడిసిపోతున్నాయి.
ఉన్నట్టుండి ఓ రోజు పూన్కుడి కళ్లు తిరిగి పడిపోతుంది.
జలపాతంలో నీళ్లు తాగడం వల్లే అస్వస్థతకు గురైంది.

వేలు ఇచ్చిన మూలికా వైద్యం పనిచేయలేదు.
గ్రామ వైద్యుడు పరిశీలించి పెద్దాస్పత్రికి తీసుకెళ్లమంటాడు.
అక్కడ నుంచి వేలుకు కష్టాలు మొదలవుతాయి.
భార్యకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారిస్తారు.
వైద్యం చేయడానికి గుర్తింపు కార్డు కావాలంటారు.
అలాంటి కార్డు ఒకటుంటుందని తెలియని అమాయకుడు వేలు.
ఆధార్ కార్డు పొందడానికి వేలు నానా అవస్థలు ఎదుర్కొంటాడు.
ప్రభుత్వాస్పత్రిలో పేదల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు దారుణం.
పూన్కుడికి బెడ్ ఇవ్వకుండా చాప మీద పడుకోబెడతారు.
ఉచితంగా చేయాల్సిన పరీక్షలకు డబ్బు గుంజుతారు.
వేలు నరకయాతన అనుభవిస్తాడు.
అడిగినంత డబ్బు తేలేక భార్యకు ఉచిత వైద్యం చేయమని వైద్యులను వేడుకుంటాడు.
పూన్కుడి అనారోగ్యం పాలవడానికి కారణం నీటి కాలుష్యమే.
కొండలపై నుంచి పారే జలపాతం ఎలా కలుషితమైందంటే..
ఎగువన ఓ రసాయనిక పరిశ్రమ నెలకొల్పుతారు.
దాన్నుంచి వచ్చే విషతుల్యాలను జలపాతంలోకి వదులుతారు.
ఏ రోగాలు రాకుండా స్వచ్చమైన వాతావరణం..
పరిశుభ్రమైన నీటితో హాయిగా జీవించే కొండవాలు ప్రజలను ఈ విషజలం కాటేసింది.

ఈ సంగతి ఓ హక్కుల కార్యకర్త దాస్ గుర్తించి నిలదీస్తాడు.
కంపెనీ ఇచ్చిన కోటి రూపాయలు అందుకొని మౌనం వహిస్తాడు.
సకాలంలో వేలు భార్యకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతుంది.
శవాన్ని ఊరికి తీసుకుపోవడానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు.
ఉచిత అంబులెన్స్ రాదు.
గత్యంతరం లేక చాపలో చుట్టి మైళ్ల దూరం మోసుకెళ్తాడు.
ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
అయినా ప్రభుత్వాల్లో చలనం లేదు.
2021 మార్చిలో ఈ తమిళ చిత్రం విడుదలైంది.
అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.
తమిళనాడులో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను
ఇతివృత్తం చేసుకొని దర్శకుడు గణేష్ వినాయకన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
తరుణ్, అబర్నతి తమ పాత్రల్లో జీవించారు.
ఎస్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతం.
ప్రస్తుతం తెలుగులో డబ్ అయి సోనీ లైవ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.