తెలుగు రాష్ట్రాల్లో సంచలన నేతంటే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డే. ఆయన ఏం చేసినా .. ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి జేసీ దివాకర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం వద్ద అవమానం జరిగింది. కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లిన జేసీని పోలీసులు అడ్డుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించడం కలకలం రేపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్. ఇనుప కంచెలు, ఎత్తయిన గేట్లు, పోలీసుల పహారాతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కేసీఆర్ ను కలవాలన్నా.. ప్రగతిభవన్ గేట్ దాటాలన్నా.. అంత ఈజీ మాత్రం కాదు. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, సొంత పార్టీ నేతలకే పర్మిషన్ ఉండదు.
అందుకే ఈటల రాజేందర్ ఆ బానిస భవన్‌ను బద్దలు కొడతానంటూ పార్టీని వీడారు. అలాంటిది.. ఏపీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా వస్తే లోనికి రానిస్తారా? ప్రగతిభవన్ గేటును కూడా తాకనీయలేదు. అట్నుంచి అటే తిప్పి పంపించేశారు. జేసీ లాంటి సీనియర్, ఫైర్‌బ్రాండ్ లీడర్‌కు ఇది ఘోర అవమానమే.
అప్పుడప్పుడూ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హల్చల్ చేసే జేసీ దివాకర్‌రెడ్డి.. ఎప్పుడుపడితే అప్పుడు ప్రగతిభవన్‌లోకి కూడా వెళ్లొచ్చని అనుకున్నారో ఏమో.. లేటెస్ట్గా ఆయన అలా ట్రై చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ కు వచ్చారు. అక్కడి పోలీసులు జేసీని అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ ఉందా అని అడిగితే.. లేదు.. జేసీ వచ్చాడని చెప్పుపో.. అంటూ దివాకర్‌రెడ్డి దర్పం ప్రదర్శించారు.
ఆయన లెవల్ అక్కడ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోకి ఎవరినీ అనుమతించరు. అది జేసీ అయినా.. గీసీ అయినా.. జాన్తానై అంటూ పోలీసులు దివాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. చేసేది లేక పెద్దాయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలు ఇంతకీ ఆ పెద్ద మనిషి కేసీఆర్‌ను ఎందుకు కలవాలని వెళ్లారో అర్థంగాక నెటిజనం జుత్తు పీక్కుంటున్నారు. అదీ సంగతి.