మాతృభాష అంతరించిపోతుందని వేదన చెందే వారికి ఇదొక ఊరట. తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (టీసీడబ్ల్యూఏ), అఖిల భారత తెలుగు సేన (ఏఐటీఎస్) నడుం బిగించాయి. భావితరం తేలిగ్గా తెలుగు నేర్చుకునే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ల పిల్లలకు ఆన్ లైన్ ద్వారా తెలుగు నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టాయి.
తొలుత 9 రాష్ట్రాలు, 8 దేశాల్లోని సుమారు 900 మంది పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు టీసీడబ్ల్యూఏ, ఏఐటీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పీడీఎఫ్ ఫార్మాట్లో అందిస్తున్న ‘అమృత భాష’పుస్తకాన్ని విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అందించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థుల్లో తెలుగు సంస్కృతిని, భాషను పాదుకొల్పాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు మూర్తి వివరించారు.
ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా అనుభవజ్ఞులైన 50 మంది తెలుగు ఉపాధ్యాయులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించడానికి మధ్య ప్రదేశ్ నుంచి పుస్తక రచయిత ఆర్వీఎస్ఎస్ శ్రీనివాస్ కార్యక్రమ ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సమన్వయ కమిటీలను వేశారు.
విదేశాలకు సంబంధించిన బాధ్యతలను పీటీ శర్మ, భవానీ సాధుకు అప్పగించారు. సెంట్రల్ అబ్జర్వర్‌గా ఢిల్లీ నుంచి న్యాయవాది బాలజ్యోతి పర్యవేక్షిస్తారు. మండలాల వారీ కార్యాచరణను చామర్తి నాగేశ్వరరావు సమన్వయం చేస్తారు. ప్రతీ ఏడాది జనవరి 16ను తెలుగు తరగతుల ప్రారంభోత్సవ దినంగా నిర్వహిస్తామని టీసీడబ్ల్యూఏ ఖతార్ సమన్వయకర్త జీకే దొర వెల్లడించారు.