ప్రియమైన సోదరీ సోదరులారా !
మీరు నన్ను చాలా మిస్ అవుతున్నట్టుంది.
కరోనా సోకినా పర్లేదనుకుంటే..
మా ఇంటికొచ్చి నన్ను కలవొచ్చు.
అభ్యంతరం లేదంటూ ఓ వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఆఫర్ ప్రకటించారు.
అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే
జొన్నలగడ్డ పద్మావతి ఇటీవల కనిపించడం లేదంటూ
నియోజకవర్గంలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి.
ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
దీనిపై పద్మావతి పై విధంగా స్పందించారు.
‘అప్పుడెప్పుడో ఎన్నికల్లో ఓటు అడగడానికి పద్మావతి వచ్చారు.
గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేరు.
ప్రజా సమస్యలను వదిలేశారు.
ఎక్కడున్నారో తెలియడం లేదు.
ఆచూకీ తెలపగలరు’అంటూ గుంజేపల్లి గ్రామస్తులు పోస్టర్లు వేశారు.
ఎమ్మెల్యే తమ గోడు వినిపించుకోవడం లేదని ఇలా పోస్టర్ వేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది.
వెంటనే ఎమ్మెల్యే పద్మావతి స్పందించారు.
మీడియా ఎదుటకొచ్చి మాట్లాడారు.
రెండు రోజులు కనిపించకపోతేనే గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అయినట్లున్నారని సెటైర్ వేశారు.
16న ఆమె భర్త సాంబశివారెడ్డికి కొవిడ్ సోకింది.
అందువల్లే కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా సోకినా పర్లేదనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి కలవొచ్చని పద్మావతి అన్నారు. పోస్టర్ వేయడం వెనుక ఎవరున్నారో.. వారి ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని పద్మావతి వాపోయారు.