చెట్టుపై పక్షులన్నీ ఒక్కసారిగా పైకిలేచాయి. అంతా గందర గోళం. ఏమైందోనని గూటి నుంచి పిట్ట తల బయటపెట్టి చూసింది. ఓ కొండ చిలువ గూళ్లన్నీ ఛిద్రం చేస్తోంది. గుడ్లు నాశనం చేస్తోంది. దొరికిన పిల్లలను ఆరగిస్తూ వేగంగా ముందుకొస్తోంది. గూట్లోనే ఉంటే ప్రాణానికి ముప్పు తప్పదని పిట్ట గ్రహించింది. అక్కడ నుంచి రివ్వున పైకి లేచింది.
ఆకాశంలో చక్కర్లు కొడుతూనే పక్షులన్నీ చర్చించుకున్నాయి. ఏ చెట్టుపై చూసినా కొండ చిలువలే తిష్టవేశాయి. తలదాచుకునే దెక్కడని పక్షులన్నీ వాపోయాయి. ఏదైనా దారి చూపిస్తుందని అంతా పక్షి రాజు దగ్గరకు చేరాయి. ద్వారం వద్దనే కమురు కంపుకొట్టింది. కొద్దిసేపు పక్షులన్నీ అయోమయానికి గురయ్యాయి. ద్వారం దాటి లోపలకు తొంగి చూశాయి. ఒక్కసారిగా హతాశులయ్యాయి. పక్షిరాజు పరివారంతో గోరింక పిట్టను కాల్చుకు తింటున్నాడు. కళ్లారా ఆ ఘోరాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాయి. ఆపదలో ఆదుకోవాల్సిన రాజే ఇలా తమను కాల్చుకుతింటున్నాడని బావురుమన్నాయి.
భూమిపై మరెక్కడన్నా తలదాచుకుందామంటే మానవులకే చాలక కొట్టుకుంటున్నారు. కనీసం ఆకాశంలో ప్రశాంతంగా విహరిద్దామనుకుంటే సెల్ టవర్ల దెబ్బకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఎక్కడకు పోవాలి.. ఎలా బతకాలని ఆలోచిస్తూ.. ఏదైనా గ్రహానికి వలస పోవాలని పక్షులన్నీ నిర్ణయించుకున్నాయి.
గ్రహాలన్నీ తిరిగాయి. కిందాపైనా ఎక్కడా వీసమెత్తు ఖాళీ లేదు. కొద్దిరోజులకు అంగారక గ్రహానికి చేరుకున్నాయి. అప్పటికే బాగా అలసిపోయాయి. ఎదురుగా ఉన్న బోర్డు చూసి అవాక్కయ్యాయి. అంగారక గ్రహాన్ని ఏదో కార్పొరేట్ కంపెనీ రిసార్ట్ నెలకొల్పేందుకు లీజుకు ఇచ్చేశారట. చీమ కూడా దూరకుండా కంపెనీ ఫెన్సింగ్ వేసింది. సొరంగాలతో కూడుకున్న అంగారకుడ్ని కూడా మనుషులు వదల్లేదు. ఏంచేయాలో దిక్కతోచని స్థితిలో పడ్డాయి.
ఇంతలో ఓ పసికూన పెద్దగా అరిచింది. చావోరేవో మన చెట్టుపైనే తేల్చుకుందామని చెప్పింది. ప్రాణాలు అరచేత బట్టుకొని ఎన్నాళ్లని.. ఎక్కడకని పోతాం ! పారిపోయే కొద్దీ ఈ సమాజం మరింత తరుముతుందని హితవు పలికింది. కూన మాటలతో పక్షుల్లో ఆలోచన మొదలైంది. చెట్లపై తాండవిస్తోన్న విషసర్పంతో పోరుకు తలపడ్డాయి. అది అవిశ్రాంత పోరాటం. మనుగడ కోసం ప్రాణాలకు తెగించిన మహా యుద్ధం. ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. ఐక్యంగా పక్షులన్నీ కొండచిలువను పొడిచి పొడిచి చంపాయి. తరతరాలుగా అనుభవిస్తోన్న భయాన్ని జయించాయి. పక్షులన్నీ విజయదరహాసంతో రెక్కలు విప్పుకొని స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తూ రివ్వున ఎగిరాయి.