తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయినా అప్పుడే రాష్ట్రంలో రాజకీయ వేడి కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ సహా విపక్షాలు పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటన్న దానిపై ఎప్పటికప్పుడు పార్టీలు సర్వేలు కూడా చేసుకుంటున్నాయి. సర్వే ఫలితాల ఆధారంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సర్వేలో వచ్చిన ఫలితం ఆ పార్టీలో జోష్ నింపింది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతున్నారట.
తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అదనంగా 12 సీట్లు గెలిస్తే చాలని తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 48 సీట్లు ఖాయమని సర్వేలో తేలిందట. ఆ సర్వే ప్రకారం దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఊపు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఆ పార్టీకి జనంలో పట్టున్న నాయకులున్నారు. మెదక్ లో కూడా పార్టీకి బలంగా ఉంది. రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ కు ఓ అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
ఉత్తర తెలంగాణలోటీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటీ ఢీ కొట్టే సత్తా ఉంది. అక్కడ నాయకులు ప్రజల్లోకి చొచ్చుకుపోలేకపోవడమే లోపంగా సర్వే వెల్లడిస్తోంది. పార్టీ యంత్రాంగం కాస్త గట్టిగా కృషి చేస్తే పార్టీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఓ పార్టీకి 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ మరో 12 సీట్లు తెచ్చుకుంటే చాలాని సర్వే చెబుతోంది.
కేసీఆర్ సర్కార్ పై జనాల్లో నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఈజీగానే మేజిక్ ఫిగర్ మార్క్ చేరుకుంటుందన్నది కాంగ్రెస్ నేతల విశ్లేషణ. ఒకవేళ అలా జరగకపోయినా.. సర్వే ప్రకారం 48 సీట్లే వచ్చినా తమ సర్కారే ఏర్పడుతుందని ధీమాగా చెబుతున్నారు. ఎలాగూ ఎంఐఎం పార్టీకి 7 నుంచి 9 సీట్లు వస్తాయి. బీఎస్పీ సహా కొందరు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశముంటుంది. వాళ్ల మద్దతు సంపాదించడం కాంగ్రెస్ కు పెద్ద కష్టం కాదు. ఏదిఏమైనా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పనితీరును బట్టి విజయావకాశాలు ఉండొచ్చు.