పీఆర్సీలో అసంబద్ధతను సరిచేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిన్న కలెక్టరేట్లను ముట్టడించాయి. దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులను ట్రోల్ చేస్తోంది. జనం కూటికి లేక చస్తుంటే అంతంత జీతాలు పొందుతున్నా ఇంకా ఆందోళన చేస్తారా అంటూ కారాలు మిరియాలు నూరుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి ప్రజల మద్దతు లేదంటోంది. వీళ్ల వాదనలపై ఉపాధ్యాయ సంఘాలు కొన్ని అంశాలను ముందుకు తెచ్చాయి. దమ్ముంటే వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
– కేవలం వైసీపీ వాళ్లు మాత్రమే పన్నులు కడుతున్నారా ! చెత్త పన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మద్యం ధరల పెంపు, వంట గ్యాస్, పెట్రో, డీజిల్పై అడ్డగోలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులుపెంచుకుంటూ పోతుంటే ఏనాడు నోరు మెదపలేదు. ఈ పన్నులను రాష్ట్ర ప్రజలందరితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులూ కడుతున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించరా !
– మొత్తం ఉద్యోగుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్, సచివాలయాలు, వలంటీర్లు కలిపి 9 లక్షల మంది ఉన్నారు. పీఆర్సీ లెక్కలోకి రాని అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ, పంచాయతీ వర్కర్లు మరో 5 లక్షల మంది ఉంటారు. ఈ 14 లక్షల మంది వేతనం నెలకు సగటున రూ.15 వేలకు మించి లేదు. రూ.50వేలకు పైన వేతనాలు పొందుతున్న ఉద్యోగులు కేవలం లక్ష మంది మాత్రమే ఉన్నారు. ఈ వాస్తవం వైసీపీ కార్యకర్తలకు తెలియదా !
– ఒక్కో ఎమ్మెల్యే జీతం రూ. 2 లక్షలు. మంత్రి వేతనం రూ.4 లక్షలు. ఐదేళ్ల పదవి తర్వాత ప్రతినెలా రూ.50 వేల పెన్షన్ తీసుకుంటున్నారు. మంత్రి వేతనం రోజుకు రూ.17 వేలు. లక్షల మంది ఉద్యోగులకు కనీసం ఉద్యోగ భద్రత లేదు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న సంగతి మరిచారా ! అదేమంటే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లడం లేదు. ప్రైవేటు వైపే చూస్తున్నట్లు అభాండాలు వేస్తున్నారు. ముందు మీ నాయకుల సంతానం ఎక్కడ చదువుతున్నారో.. జబ్బు చేస్తే ఎక్కడ వైద్యం చేయించుకుంటున్నారో అడగండి. ఎవరి ఆర్థిక స్తోమతును బట్టి వాళ్ల ప్రాధాన్యాలుంటాయి. ఇది మరిస్తే ఎలా !
– ఉద్యోగులు అవినీతిపరులంటున్నారు. అలాంటి అక్రమార్కుల్ని దండించవద్దని ఎవరు అడ్డుపడుతున్నారు ! అలాంటి ఉద్యోగుల వద్ద కమిషన్లు నొక్కేసి చూసీచూడనట్లు వ్యవహరించే ప్రజా ప్రతినిధులను నిలేయండి. ఉద్యోగుల ఆస్తులపై విచారణ చేస్తారా.. చేయండి. దాంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఆస్తులపై కూడా ఏసీబీ విచారణ జరిపించండి. ఎవరు సచ్చీలురో.. మరెవరు అవినీతి పరులో తేల్చమని మీ నాయకులను అడిగే దమ్ముందా !
courtesy by : duvva sesha babji