ఇంకొన్ని దశాబ్దాలు గడిసినంక
ఒక దేశం దొరకొచ్చు.
మనమూ మడుసులమే
అనే లెక్కోటి ఉండొచ్చు.
మన నెత్తురూ
మన కన్నీళ్లూ
మన అరి గోసా
ఏదో ఒక నాటికి చరిత్రా కావొచ్చు.
మడిసన్నాక
ఉండడా..సెడ్డోడు,
ఆడెక్కడుంటే అక్కడ
మన బతుకు బుగ్గేనే.
అట్టగని ఆగిపోతమా… ఏందీ?
పోతానే ఉండాలా!
మంచోళ్ళు గూడా ఉంటారు..మే
సూసుకోవాల
సదుం కోవాల
సదువంటే అట్ఠాంన్తి ఇట్ఠాన్తి సదువు గాదు
బక్కోడి కన్నీళ్లు తుడిపే సదువు.
అదీ సదువంటే.
నవ్వుకోవాల మే.. మనం గూడా!
మనం ఏడిత్తే నవ్వుకునే దేశిమే ఇదీ.
మన నెత్తురు కళ్ళ జూడకుండా శాంతించని దేశిమే తల్లా.
ఎంతమంది ధర్మ పెబువులు ఉండారో తెల్సా..మే.
బుజ్జా..నువ్ సదుకో
ఆడ పిల్లల సదువేనే దేశాన్ని నిలబెట్టేది.
మగ పిల్లల సదువు గదో, కట్నాలదిగేది.
మన దగ్గిరేడుంది లిబ్బీ.
బుజ్జా…నువ్ సదుకోయే బాగా.
అమ్మకి నువ్వన్నా… కూత్త పున్నీళ్ల బువ్వెట్టే.
గురుమూర్తి సార్ పిలుత్తాండు.
మల్లోస్తనో…రానో.
ఇదో లచ్చే… బిడ్డ జాగర్తె.
(ఆస్కార్ బరిలో జై భీమ్….
ప్రపంచానికి మన ముచ్చట ఎన్నిసార్లు తెల్సినా మనుషులే కాదు, సినిమా తెర కూడా మారడం లేదు.)
– Dr.Ravikumar Nukathoti