” సార్ ! ఇంకా ఎవరైనా టిక్కెట్ తీసుకోవాలా !”
కండక్టర్ గొంతు చించుకొని అరిచాడు.
ఎవరూ స్పందించలేదు.
ఎవరి గొడవలో వాళ్లున్నారు.
మళ్లీ చివరి నుంచి ప్రయాణికుల్ని లేక్కేసుకుంటూ వెళ్లాడు.
ప్చ్..! తేడా వస్తోంది.
31 మంది ఉంటే 30 టిక్కెట్లే తెగాయి.
మరొకరు ఎవరో టిక్కెట్ తీసుకోవాలి.
కాసేపు నెత్తి గోక్కున్నాడు.
” సార్ ! దయచేసి టిక్కెట్ తీసుకోండి !
మీ వల్ల ఇప్పటికే పావుగంట లేటయింది !
ప్లీజ్ సర్ !” అంటూ కండక్టర్ బతిమాలుతున్నాడు ప్రయాణికుల వైపు చూస్తూ..
ఐదో నంబరు సీట్లో కూర్చున్న వ్యక్తి
బస్సు ఎక్కినప్పటి నుంచి
మొబైల్లో ఎవర్నో తింటున్నాడు
బయట ప్రపంచాన్నే మర్చిపోయాడు.
పక్కనున్న ప్రయాణికులకు అతని తీరుతో చిర్రెత్తుకొస్తోంది.
కండక్టర్ మళ్లీ టిక్కెట్స్ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు.
అతని దగ్గరకొచ్చి టిక్కెట్ అడిగాడు.
అప్పుడు మొబైల్ పక్కన పెట్టి పర్సు వెతుకుతున్నాడు.
” మీరు టిక్కెట్ తీసుకోలేదు లెండి !
ఎక్కడకు వెళ్లాలో చెప్పండి !”
అని కండక్టర్ సంయమనంగా అడిగాడు.
ప్రయాణికులంతా అతని వైపే చూస్తున్నారు.
చిలకలూరిపేటకు టిక్కెట్ తీసుకున్నాడు.
మళ్లీ మొబైల్లో దూరాడు. సోది మొదలెట్టాడు.
చిలకలూరిపేట వచ్చింది.
అయినా అతను పట్టించుకోలేదు.
బస్సు ఊరుదాటుతోంది.
సార్! మీరు దిగరా అంటూ కండక్టర్ పెద్దగా అరిచాడు.
అప్పుడు మొబైల్ పక్కన పెట్టి హడావుడిగా లేచాడు.
వేగంగా అడుగులేస్తూ కింద బ్యాగు చూసుకోలేదు.
అది కాలికి తగిలి బొక్క బోర్లాపడ్డాడు.
చేతిలో మొబైల్ మూడు ముక్కలైంది.
తగిన శాస్తి జరిగిందంటూ ప్రయాణికులంతా నవ్వులే నవ్వులు.