ఓ లక్ష్యం కోసం పనిచేసే ప్రభుత్వం కావొచ్చు. నాయకులు అవ్వొచ్చు. మీ శత్రువులెవరో తెలిస్తే.. ఎవరిపై పోరాడాలో స్పష్టత వస్తుంది. లేకుంటే గుడ్డెద్దు చేలో పడ్డ సామెతే. గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు దీనికి అద్దం పడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో అవగాహనా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
నాడు వ్యవస్థలో ఓ గుణాత్మక మార్పునకు వైసీపీ కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు హామీనిచ్చింది. తదనంతర కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు అనుగుణంగా లేవు. నిరంతరం ఓ అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. ఏది ముందు.. ఏది వెనుకనే విషయంలో అస్పష్టత కనిపిస్తోంది. అది కేంద్రంపై పోరాటం నుంచి మూడు రాజధానులు, ఇతర జీవోల దాకా కొనసాగుతోంది.
తాజాగా ఉద్యోగుల పీఆర్సీ విషయంలోనూ ప్రభుత్వ తప్పటడుగులు సమస్యను జఠిలం చేస్తోంది. ఇది నవరత్నాల్లో ఓ రత్నం కాదు. ఉద్యోగులకు ప్రతీ ఐదేళ్లకోసారి పే రివిజన్ చేసే ఓ కార్యక్రమం. వాళ్లకు సంబంధించి ముందుకొచ్చిన డిమాండ్స్‌పై మంత్రి వర్గ ఉప సంఘం వేసి ఉంటే బావుండేది. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఓ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చేందుకు దోహదపడేది.
దీనికి భిన్నంగా ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టును బయటపెట్టకుండా సీఎస్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పీఆర్సీ ప్రకటించింది. ఇది తమకు ఆమోద యోగ్యం కాదని ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పాత వేతనాలే ఇమ్మంటున్నారు. పీఆర్సీ గురించి మరోసారి చర్చిద్దామంటున్నారు.
దీనికి భిన్నంగా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతున్నట్లు వ్యక్తమవుతోంది. పీఆర్సీ జీవో ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ఉద్యోగులు సహకరించకున్నా ముందుకే వెళ్లాలని భావిస్తోంది. పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రజల్లో విష ప్రచారానికి ఆజ్యం పోస్తున్నట్లుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారం బయటకు పోతే నష్టపోయేది ప్రభుత్వమే కదా ! చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతగా ఇప్పుడు మంత్రుల కమిటీ వేశారు.
మంత్రుల కమిటీకి ఏం చట్టబద్దత ఉందని తాము చర్చించాలంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెబుతారు ! పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకున్న తర్వాతనే చర్చలకు వస్తామని ఖరాఖండిగా తేల్చాయి. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ సమస్యను సంయమనంతో పరిష్కరించేట్లు చొరవ చూపాలి. ఉద్యోగ సంఘాలతో తానే నేరుగా మాట్లాడితే పోయేదేమీ లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక కష్టనష్టాలతో అతలాకుతలమవుతోంది. ఇలాంటి తరుణంలో ఉద్యోగుల సమ్మె మరికొన్ని తలనొప్పులకు దారితీస్తుంది. ఆలోచించండి సీఎం సార్ !