కొత్త జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో ఓ వైపు ఉద్యోగుల ఉద్యమం కొనసాగుతోంది. దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కొత్త జిల్లాలను ముందుకు తోసినట్లు కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు నిట్టనిలువునా చీలిపోతాయి. వాటికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు విడిపోనున్నాయి. ఇది ప్రజల్లో భావోద్వేగాలను మరింత పెంచనున్నాయి. ఇదంతా చూస్తుంటే.. ఉద్యోగుల ఆందోళన గీత పక్కన కొత్త జిల్లాల పేరుతో మరో పెద్ద గీత గీసినట్లుంది. ఇది సర్కారుకు పులి పోయి భూతం పట్టుకున్న సామెతగా మారొచ్చు.
ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నించింది. ఏవేవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. జనాభా లెక్కలు పూర్తయ్యేదాకా జిల్లాల భౌగోళిక హద్దులు మారడానికి వీల్లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది మే నాటికి జనాభా లెక్కలు పూర్తి కావాల్సి ఉంది. కొవిడ్ కారణంగా జనాభా లెక్కల సేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. మరేదైనా ప్రత్యామ్నాయ రూట్లో కొత్త జిల్లాల ప్రక్రియను చేపడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. బాగా వెనుకబడిన ప్రాంతాలు కొత్త జిల్లాగా ఏర్పడితే ఏదైనా అభివృద్ధికి దోహదపడవచ్చని అక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. ఈపాటికే నగరాలు, పట్టణాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు మరెక్కడో ఉన్న మరో జిల్లా పరిధిలో చేర్చడాన్ని అక్కడ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వివిధ ప్రాంతాల ప్రజల జీవన సంస్కృతి, భౌగోళిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా ఉనికినే కోల్పోతుంది
ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు
ప్రకాశం జిల్లాలోని కందుకూరును నెల్లూరులో చేరుస్తారు. మార్కాపురం కొత్త జిల్లా అవుతుంది. బాపట్ల పార్లమెంటు కింద ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా కిందకు పోతే అసలు జిల్లా ఉనికినే కోల్పోతుంది. సాగు, తాగు నీటి సదుపాయాలుండవు. ఉపాధి అవకాశాలకు అవకాశమే లేదు. ఇప్పటిదాకా పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లా బలైంది. ఇప్పుడు కొత్త జిల్లాల విభజనతో ఆనాటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో ఏర్పడిన ప్రకాశం జిల్లా ఆనవాళ్లు కోల్పోతుంది. ప్రభుత్వం జిల్లా భౌగోళిక స్థితిగతులు, ప్రజల మనో భావాలను పరిగణనలోకి తీసుకోవాలి. బాపట్ల పరిధిలోని సంతనూతలపాడు, అద్దంకి, నెల్లూరు పరిధిలోని కందుకూరు నియోజకవర్గాలను ఒంగోలు జిల్లా పరిధిలోనే ఉంచాలి.